7, జులై 2025, సోమవారం

అనుబంధాల లోగిలిలో ప్రేమ జల్లు

ఎన్ కే మిశ్రా & నవ్య నిర్వహించిన 2012 కథల పోటీలో 2000 రూపాయల నగదు బహుమతిని అందుకున్న కథ అనుబంధం లోగిల్లో ప్రేమ జల్లు నిశ్శబ్ద రాగాన్ని ఆలపిస్తూ భూదేవి సకల జనాలను ఆదమరిచి నిదురపోయేలా జోల పాడుతున్న వేళ కృష్ణ కిరణ్ నిదురపోకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అది ఏ ప్రభుత్వ పంచ వర్ష ప్రణాళిక గురించో కాదు. రేపు అమ్మా, నాన్నలను ఏ విధంగా చూసుకోవాలి? ఎంతలా సుఖపెట్టాలని! అతని ప్రతి ఆలోచనా దాని చుట్టూనే తిరుగుతుంటుంది. దానికో ఆకారాం వస్తే గానీ అతనికి మన:శాంతి వుండదు. అప్పటిదాకా అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే వుంటాడు. చెట్లన్నీ మౌన పాఠాన్ని వినిపిస్తున్నాయి. ఎదురింటి గోడమీద పడుతున్న అతని నీడ ఒక్కటే అతని తోడుగా అనుసరిస్తోంది. అతని నిస్వార్థ కృషి ఫలించి తొమ్మిది నిముషాల తర్వాత ఓ మంచి ఆలోచన పురుడు పోసుకుంది. సంతోషం. పాప పుట్టింది. అది వెల్లువై రేపు తన తల్లిదండ్రులను ఆనందంలో తడపాలి అనుకున్నాక అప్పటిదాకా దూరంగా దాక్కున్న నిద్రాదేవి అమాంతం వచ్చి మీద పడి అతన్ని ఆవహించింది. * * * అమ్మా! నాన్నా! ఈరోజు మనం 'సిరిపురం' వెళుతున్నాం. "నిజమా!" వాళ్ళిద్దరి కళ్ళల్లో అంతు లేని కాంతులు. "తొందరగా రెడీ అవండి. ఆలశ్యం చేస్తే ఊరుకొనేది లేదు" తండ్రి పిల్లలకు చెప్పినట్లు చెప్పి ఇద్దరికి ముద్దు ఇచ్చి వెళ్ళాడు. ఎందుకాలశ్యం చేస్తాం అన్నట్లు తల్లీ, తండ్రీ పోటీ పడుతూ గబగబా లేచి దుప్పట్లు మడత బెట్టబోయారు. "ఆ పని మీకెందుకూ? నేను చూస్తానుగా! మీరు వెళ్ళి తయారవ్వండి". ఎప్పుడు వచ్చిందో కోడలు 'కారుణ్య ' కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది. ఏ పనీ చెయ్యనివ్వదు. "పైగా ఇన్నాళ్ళూ చేసింది చాలు. ఈ వయసులో హాయిగా విశ్రాంతి తీసుకోవాలి". అంటూ వాళ్ళను చిన్న పిల్లలను చేసి నీతులు చెబుతుంది. అందుకే చిన్నతనంలో తను ఏదయినా పని చెప్పినప్పుడు కామ్ గా చేసేస్తానన్నట్లు నోటి మీద వేలు వేసుకుని కృష్ణ తమకు సంజ్జ చేసి ఆ పని చేసేవాడు. అది గుర్తు వచ్చి నవ్వుకుంటూ బయటకు నడిచారు. కొడుకు, కోడలి ఆప్యాయతతో అనునిత్యం సుప్రభాతం పాడే అదృష్టం నూటికో కోటికో ఏ ఒక్కరికో దక్కుతుంది. అది భగవంతుడు తన సొంతం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనను అనుసరించింది ఆమె. ఎనిమిది గంటలకు అలారం కొట్టింది. టిఫిన్ తిని హాలులో పడక్కుర్చీలో కూర్చొని పేపరు చదువుకుంటున్న తండ్రి చెంత చేరి "నాన్నా! ఇదిగో మీ షుగర్ టాబ్లెట్" అన్నాడు. పేపరు ప్రక్కన బెట్టి ఆయన మందు బిళ్ళను తీసుకోగానే ఎడమ చేతిలో ఉన్న మంచి నీళ్ళ గ్లాసును కుడి చేతిలోకి తీసుకుని ఆయనకి అందించాడు. పక్కింట్లోంచి పరశురామయ్య గొంతు 'నాకూ వున్నారు కొడుకులు చంపటానికి మందులిస్తారు గానీ బ్రతకటానికి మంచి నీళ్ళు కూడా పొయ్యరు. ప్రక్కింటి కృష్ణను చూసి బుద్ధి తెచ్చుకోండిరా" అంటే "పెద్ద చెప్పొచ్చావులే! నోరు మూసుక్కూర్చో!'' అని దబాయిస్తూ ఏదో బిరుదు ఇచ్చినంత ఆనంద పడిపోతారు. ఎవరికెంత రాసి పెట్టివుంటే అంతే'అని అలా సర్దుకుపోవటం అలవాటు చేసేసుకున్నాడు. తప్పదుగా మరి. "అమ్మా! బి.పి. టాబ్లెట్". "నేను వేసుకుంటాను కదరా! కాళ్ళు చేతులూ ఆడుతున్నంత సేపూ మా పని మమ్మల్ని చేసుకోనివ్వరా!" "మరి చిన్నప్పుడు నేను ఆ పని చేసుకోలేనా? మీరెందుకు చేసే వారు?" అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు. "అదా! చిన్నతనం కదా! ఆ చేతులు ఈ చేతులతో తీసి వేసుకుంటే లేని రోగం వస్తుందని భయం". "ఇప్పుడు మీరూ నాకంతేనమ్మా! ఒక టాబ్లెట్ కి ఒక టాబ్లెట్ వేసుకున్నా, అది తీసుకుంటుంటే జారి క్రింద పడినా, మరచిపోయినా ఇలాంటివి ఎన్నో చెప్పగలను" అన్నాడు మురిపెంగా తల్లినే చూస్తూ. "సరేలేరా!" క్రింద కూర్చొని అమ్మ వొడిలో తల పెట్టుకుంటూ "అయినా అమ్మా! ఆఫీస్ కెళ్ళే దాకానే కదమ్మా నీకు నేనేమి చేసినా. ఆ తర్వాత నేను చెయ్యాలన్నా చెయ్యలేనుగా" "పిచ్చి నాన్నా!" అంటూ అతని నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది ఆవిడ. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వెతుక్కోవటానికి వాడు రెండు గంటల ముందు నిద్ర లేస్తాడు. అలాంటివి తలుచుకుంటేనే ఎంతో హాయిగా వుంటుంది. "తాతయ్యా! ఈ రోజన్నా మీకంటే ముందు రెడీ అవుదామనుకున్నాం. ప్చ్! ఎప్పుడూ మీరే గెలుస్తారు" బుంగమూతి పెడుతూ నిర్మల్, ఖ్యాతి అన్నారు ఒకేసారి. "రేపు నేను ఓడిపోతాను. సరేనా?" "వద్దు. గెలుపు అన్నది ఒకరు ఇస్తే తీసుకునేది కాదు. ఎవరికి వాళ్ళు సాధించి గెలుచుకోవాలని నాన్న చెప్పారు"అన్నాడు నిర్మల్. "అవును. రేపు ఇంకొంచెం ముందు లేచి మేమే ఫస్ట్ గా తయారవుతాం కదరా అన్నయ్యా!"అంది ఖ్యాతి తలూపాడు నిర్మల్ అవునన్నట్లుగా. "అందరూ రెడీయేనా! ఇక బయలుదేరుదామా!" వాచీ పెట్టుకుంటూ అడిగాడు. "ఓ(! అన్నారు అందరూ ఒకేసారి. "అయితే పదండి. నేను కారు గ్యారేజీలోంచి క్షణంలో తీసుకువచ్చేస్తాను" కీ చైన్ ను వూపుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణ కిరణ్. సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియలేదు. "అప్పుడే వచ్చేసామా!" అనుకున్నారు అందరూ. * * * పచ్చటి పొలాల మధ్య ఆ భవనం ప్రశాంతతకు నిలయంలా కనిపిస్తోంది. వివేకానంద్ పరుగులాంటి నడకతో వచ్చి కౌగలించుకున్నాడు విద్యాసాగర్ ని. "కలా! నిజమా! అంటూ. "నిజమేరా బాబూ!" అన్నాడు నవ్వుతూ. "ఈ రోజుల్లో కాస్త సమయం దొరికితే చాలు ఆ ఛానల్, ఈ ఛానల్ అంటూ టీ.వీ కి అతుక్కుపోతున్న వారే ఎక్కువ. అందుకే ఎదురు చూపులూ, అనుభూతులు కరువయిపోయాయి. "అందుకే కదా నాన్నను తీసుకువచ్చింది. ఇక సాయంత్రం దాకా మీ ఇష్టం. అత్తయ్య దగ్గరికి అమ్మ చేరిపోయినట్లుంది"అన్నాడు కృష్ణ నవ్వుతూ. "ప్రాణ స్నేహితురాలు కదా!"అన్నారు ఆయన కూడా నవ్వుతూ "ఇక మనమెవరం కనిపించం"అంటూ వాళ్ళను లోపలికి తీసుకెళ్లారు వివేకానంద. "అప్పుడే మా ఇద్దరి మీదా అభాండాలు వేయటం మొదలుపెట్టారా!? అయినా కృష్ణా! నిన్న ఫోన్ చేసి చెప్పచ్చుగా వస్తున్నామని. ముందే లేచి వంట అంతా చేసుకునేదాన్ని. ఇప్పుడు అందరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం" అంది విశాల. "అందరం కలిసి చేసుకోవచ్చు అంటాననుకున్నావా? అదేం కాదు. కారుణ్య అన్నీ రడీ చేసి తీసుకువచ్చేసింది. నువ్వేం దిగులు పడకు. హాయిగా అమ్మతో కబుర్లు వేసుకో అత్తయ్యా"అన్నాడు చిన్నగా నవ్వుతూ కృష్ణ. "ఎందుకురా శ్రమ?" అంది కారుణ్యను ప్రేమగా చూస్తూ. "శ్రమ కాదు. మిమ్మల్ని సర్ ప్రైజ్ చేద్దామని" అంతకంటే చిలిపిగా సమాధానమిచ్చింది కారుణ్య. "అరేయ్! విద్యా! నీతో చదరంగం ఆడి చాలా రోజులయింది. ఓ పట్టు పడదామా!" "నేను రడీ! “ అన్నారాయన ఉత్సాహంగా. "నేను ఓడిపోతే మళ్ళీ గెలవాలని నువ్వూ, నువ్వు గెలిస్తే మళ్ళీ నిన్ను ఓడించాలని నేనూ ఎంత పోటీ పడే వాళ్ళం?" "అవునురా వివేకా! అలా గంటలు గంటలు మనకు తెలీకుండానే దొర్లిపోయేవి. అవునూ.. వీళ్ళిద్దరూ ఏరీ?" "ఇంకేముందీ పెరట్లో 'దాయాలు ' ఆడుతూ వుండి వుంటారు". "అహ్హహ్హ...ఇద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా. పిల్లలిద్దరూ తాతయ్యల ప్రక్కకు చేరి ఆటను గమనిస్తున్నారు. కారుణ్య, కృష్ణ, అమ్మకి, అత్తయ్యకి జోడీలయ్యారు. కడుపులో ఆత్మారాముడు గోల పెట్టడంతో ఆటలకు స్వస్తి చెప్పి భోజనాలకుపక్రమించారు. కారులోంచి సామానులు అన్నీ తియ్యటం కృష్ణ వంతు. చేరవేయటం లో పిల్లలు, సర్దటంలో కారుణ్య బిజీ అయిపోయారు. అప్పటికే ప్లేట్లు, గ్లాసులు సర్దేశారు రూపా, విశాల. అందరి మధ్య కబుర్ల రైళ్ళు పరుగెట్టాయి. విశేషాలు ఊర్లో సందడి చేశాయి. అరుపులు చుక్...చుక్ రైలై, కేకలు కూ....కూ లుగా ఆ ప్రదేశమంతా నవ్వుల ప్లాట్ ఫారమ్ లా కళకళలాడింది. సాయంత్రం అవడంతో అందరి ముఖాల్లో దిగులు మేఘాలు క్రమ్ముకున్నాయి. అలా ఒక రౌండు వేశారు తోట లోకి. దోర మగ్గిన మామిడి పళ్ళను చేతితో కోసుకొని నోటితో కొరికి తిన్నారు. అందులో మజాను ఆస్వాదించారు. తిరుగు ప్రయాణానికి ఉపక్రమించారు. "అమ్మా! దారిలో నాన్న గారికి రెయిన్ కోటు, నీకు స్వెట్టర్ కొనుక్కుందాం. గుర్తు చెయ్యి. వచ్చేది వర్షా కాలం. ఈసారి అన్నీ ఎక్కువేనట". "అలాగేలేరా!" అందావిడ. పాతవి వున్నాయిగా అన్న మాటను గొంతులోనే మింగేస్తూ. తమ చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఉన్న కాస్త సంపాదననూ పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ సాదా సీదా జీవితాన్ని గడిపారు. ఇప్పుడైనా తను సంతోషపెట్టాలి. అందుకే వారి ఆనందం కోసం లక్షలు గుమ్మరించటానికి కూడా తను వెనకాడటం లేదు. అందుకే ఇందాక మామయ్యతో రహస్య మంతనాలు కూడా జరిపాడు తండ్రికి తెలియకుండా కృష్ణ. * * * ఫార్క్ అంతా సందడి గా వుంది. కాని పరశురామయ్యలో మాత్రం ఆకాశమంత దిగులు. దానిని కాస్త తగ్గించుకోవటానికి విద్యా సాగర్ ని పిలిచాడు. వస్తూ వుండి వుంటాడు. నూరేళ్ళ ఆయుషు. అన్నట్లు ఆయన అప్పుడే వచ్చారు. "ఏమిటిరా సంగతి" అంటూ. "ఏముందిరా! రోజురోజుకి ఇంట్లో నా పరిస్థితి హీనమైపోతోందిరా. వాళ్ళను నమ్మి నాకున్న ఆస్థి నంతా ఇచ్చేసినందుకు నన్ను వృద్ధాశ్రమానికి పొమ్మంటున్నారురా". కళ్ళలో బాధ గొంతులోంచి తన్నుకొస్తోంది. "నేను మీ పిల్లలతో మాట్లాడుతానులేరా!" "మాట్లాడితే మారే రకాలా వాళ్ళు?" "మర్యాదగా వినకపోతే బెదిరిస్తాను" "ఎలా?" "వాళ్ళ దారులు వాళ్ళ కుంటే మన దారులు మనకుంటాయి. ఆరోగ్యం సరిగా లేని సమయంలో బలవంతంగా నా చేత సంతకం పెట్టించుకున్నారని కోర్టులో కేసు నీ చేత వేయిస్తానంటాను. దెబ్బకు దిగి వస్తారు". "ఎంత నాటకం ఆడారురా! వీళ్ళు నేను కని, పెంచిన పిల్లలేనా అనిపిస్తోంది. ఎంత నిస్వార్థంగా వాళ్ళని ప్రేమించాను? నోట్లోంచి మాట రాకుండానే అన్నీ కొనిపెట్టిన నాకు నోటికింత ముద్దనందివ్వలేక పోతున్నారు. నా సంపాదనే నాకు ఖర్చు పెట్టలేక పోతున్నారు. ఇక వాళ్ళదయితే నన్ను బ్రతికుండగానే స్మశానానికి తోలేస్తారేమో!"అన్నారాయన బాధతో. "అంతంత మాటలెందుకులేరా! నేను చూసుకుంటానుగా. వదిలెయ్. ప్రశాంతంగా వుండు" "ఎక్కడ ప్రశాంతత? అది నా జీవితంలో దొరుకుతుందని నమ్మకమే లేకుండా పోయింది"అన్నారాయన నిరాశ నిండిన గొంతుతో. "అలా వైరాగ్యపు మాటలు వద్దు. రేపటిలోగా నీ సమస్యను తేల్చేస్తానని అన్నానుగా"ఓదార్పుగా భుజం మీద చేతితో తడుతూ అన్నారు విద్యాసాగర్. "సరే! చూద్దాం!". అనుకున్న వారిద్దరూ మళ్ళీ కలవలేనంత దూరంగా విడిపోయారు. ప్రశాంతత దొరకదన్న ఆయనకు శాశ్వత ప్రశాంతతను ప్రసాదించాడు భగవంతుడు. దొంగ ప్రేమలు, దొంగ ఏడుపులతో పది రోజులు నాటకాన్ని రక్తి కట్టించారు. పదవ రోజు, పదకొండవ రోజు కార్యక్రమాలు మాత్రం ఘనంగా జరిపించారు. బ్రతికుండగా ఆయన్ని పట్టించుకోలేదు గానీ ఆత్మ శాంతి కోసం మాత్రం తెగ ఖర్చు పెట్టేశారు. అలా చెయ్యకపోతే దెయ్యమై పీడిస్తాడని భయం కాబోలు!" విద్యా సాగర్ కళ్ళ నుంచీ రెండు కన్నీటి బొట్లు రాలాయి పరశురామయ్య గారి ఆత్మ శాంతి కోసం. నా కోసం కన్నీళ్ళు కార్చేవాడు ఒకడున్నాడని పరశురామయ్య ఆత్మ ఆనందంతో గెంతులేసింది. నిజంగా దెయ్యమయ్యి పిల్లలను పీడించాలనుకోలేదు ఆయన. తండ్రి మనసు మరి. అది ఎప్పుడూ పిల్లల బాగునే కాంక్షిస్తుంది. ‌ * * ‌ * "అమ్మా! మిమ్మల్ని ఈ రోజు ఎక్కడికి తీసుకు వెళుతున్నానో తెలుసా?" "లేదురా! ఎవరిదైనా పెళ్ళి వుందా?" "పెళ్ళి కాదమ్మా! అంతకన్నా గొప్పదే" "ఏమిటో? నువ్వే చెప్పు" "ఊహూ! చెప్పను. చూపిస్తాను". "నీదంతా సస్పెన్సేరా! నాన్నకైనా చెప్పావా?" "అబ్బో! నాన్నకు చెబితే నీకు చెప్పకుండా వుంటారా?" నవ్వుకుందావిడ లోలోపల. "ఈ రోజెక్కడికో?" అనుకుంటూ వచ్చి కారెక్కారు విద్యాసాగర్. చిన్నప్పుడు వీడిని తనెంత ఆనంద పెట్టాడో తెలియదు కానీ వీడు మాత్రం నవ వసంతంలా రోజుకో సంతోషాన్ని అందిస్తున్నాడు. కారు 'నిమ్మకూరు ' వైపు కదిలి పోతోంది "అరే! మన ఊరండీ!" ఆశ్చర్యంగా అంది రూపా దేవి. వాళ్ళిద్దరూ మేనత్త, మేనమామ బిడ్డలు. ఒకే స్కూల్లో, ఒకే ఇంట్లో పెరిగి పెద్దవారయ్యారు. ఇక అర్థమైపోయింది. వీడు తన ఇంటికి తీసుకు వెళుతున్నాడని. కనుమరుగవుతున్న ప్రదేశాలను, వాటి జ్గ్నాపకాలను నెమరు వేసుకుంటూ కబుర్లలో పడ్డారు. సడన్ బ్రేకుతో కారు ఆగటంతో వాళ్ళ కబుర్లు ఆగాయి. ఎదురుగా తాము చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూలు. రంగురంగుల కాగితాలతో అలంకరించారు. "ఈ రోజు ఆగస్టు 15 కాదే!" విద్యాసాగర్ ఆలోచిస్తున్నాడు. రూపాదేవి అయితే ఇంకా ఆశ్చర్యంలోనే వుంది. అప్పటిదాకా గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్న వారంతా వీరి కారు ఆగటంతో ఒకరి తర్వాత ఒకరుగా నెమ్మదిగా ఆ జంటను చేరారు. వాళ్ళల్లో కొందరు తమ తోటి టీచర్లు, మరి కొందరు స్టూడెంట్స్. అందరినీ ఒక్క చోట చూడటం వారిద్దరికీ కనుల పండుగలా వుంది. ఒక్క 'సిరిపురం ' వెళ్ళి స్నేహితునితో గడిపి వస్తేనే ఎంతో ఆనందించాడు. అలాంటిది ఇంతమంది స్నేహితులు ఒక్కసారి వచ్చి ముందు నిలుచుంటే... మాటలు కరువవుతున్నాయి. కృష్ణ కిరణ్ ఎక్కడని ఆయన కళ్ళు వెతుకుతున్నాయి. కారును ఒక ప్రక్కగా పెట్టి అప్పుడే లోపలికి వస్తున్నాడు అతను. ఒక్కసారి వెళ్ళి ఆప్యాయంగా అతన్ని కౌగలించుకుని వెన్ను తట్టారు. కళ్ళతోనే సమాధానమిచ్చాడు కృష్ణ కిరణ్. కబుర్లు, ముచ్చట్లు అయ్యాక పది గంటలకు సభ ప్రారంభమైంది. సభ ముఖ్యోద్దేశాన్ని కృష్ణ కిరణ్ తన మాటలలో తెలియపరచటం ప్రారంభించాడు. "నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా నాన్న గారి స్నేహితులకు, శిష్యులకు, వారి కుటుంబాలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి చిరునామాలను సేకరించటంలో నా స్నేహితులు ఎందరో నాకు తోడ్పడ్డారు. వారు కూడా ఇక్కడే వున్నారు. వారి సహాయానికి నా మన:పూర్వక కృతజ్ఞతలు. మా అమ్మా నాన్నల పేరిట ఏదైనా మంచి పని చెయ్యాలని ఎప్పటినుంచో ఒక కోరిక నాలో మిగిలిపోయింది. 'రూపాసాగర్ ' పేరుతో ఒక ట్రస్టును, ఒక కాలేజీని మన ఊరిలోనే నిర్మించాలని నిశ్చయించాను. దీనితో ఉన్నత చదువులకు మన ఊరి పిల్లలు వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం వుండదు. అలాగే బీదరికం, అనాధననే భావన ఎవరిలో ఉండకూడదనేది ట్రస్ట్ ఆశయం. ఏ తోడూ లేని వారికి మా ట్రస్ట్ 'అమ్మ 'గా, 'నాన్న ' గా నిలబడుతుంది. వారికి ఉచిత విద్య, వసతి, భోజనాలను అందజేస్తుంది. ఈ శుభకార్యానికి మీ అందరి ఆశీస్సులూ కావాలి. తమకు చదువు చెప్పిన గురువు గార్లను అమ్మ, నాన్న గార్లు సత్కరిస్తారు. ఆ పైన విందు కార్యక్రమం. అందరూ భోజనం చేసి ఆట పాటలలో పాల్గొని వెళ్ళవలసిందిగా అభ్యర్థిస్తున్నాను"అంటూ సెలవు తీసుకున్నాడు కృష్ణ కిరణ్. చప్పట్లతో ఆ ఆవరణ అంతా ఒక్కసారి మారుమ్రోగిపోయింది. సన్మానాల కార్యక్రమం ముగిశాక స్కూలు యాజమాన్యం ఉడుత సాయంగా చిరు సత్కారాన్ని ఆ దంపతులకు అందజేశారు. షామియానా క్రింద చేరి పిల్లలు, పెద్దలు కేరింతలతో ఆటలు పాటలతో ఆనందపు అంచులు చూశారు. ప్రాంగణమంతా వాళ్లందరి నవ్వులతో కళకళలాడింది. సూర్యాస్తమయం వేళ అందరూ అందరితో వీడ్కోలు తీసుకున్నారు. అప్పటిదాకా వున్న ఆనందం ఆవిరయిపోయి వేదన మబ్బు కళ్ళల్లో కన్నీళ్ళ రూపంలో వర్షంలా జారింది. అందులో కూడా తియ్యని అనుభూతి. ఆ ఆస్వాదనలో తమని తాము మరచిపోయిన ఆ దంపతులకు మరో గొప్ప అనుభూతి కళ్ళెదురుగా వారి అనుబంధాల లోగిలి. గత పాతికేళ్ళుగా తమ సంసార జీవనాన్ని గడిపిన తమ ఇల్లు పెళ్ళి కూతురిలా రంగు రంగుల దీపాలతో వెలిగిపోతోంది. ఇంటిముందు స్థలం ఇరుగు పొరుగులతో, వూరి వారితో, బంధువులతో కిటకిటలాడుతోంది. ఆహ్వానించటానికి ఎదురు వస్తున్న కూతురు, అల్లుడు, పిల్లలు. అడుగులో అడుగు వేస్తూ గేటును సమీపించిన ఆ జంటకు 'షష్టి పూర్తి ఆహ్వానం' అన్న బేనరు స్వాగతం పలికింది. దానికి ఇరువైపులా తామిద్దరి ఫోటోలు. సిగ్గు పడ్డారు కొత్త జంటలా ఒక్క క్షణం. అభినందనల వెల్లువలో ఆ బిడియం ఎటో వెళ్ళిపోయింది. కృష్ణ కిరణ్ దూరంగా నిలబడ్డా తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే వెలుగులను గమనిస్తూనే వున్నాడు. అందులో అనుబంధానికి అర్థం వెతుక్కుంటున్నాడు. "ఏరా! నా అవసరము ఏమీ ఉండదు లేరా ఇక నే వెళ్ళి రానా!"అన్న డాక్టర్ ఫ్రండ్ ప్రశ్నకు ఉలిక్కిపడుతూ. "ఒరేయ్! నువ్వు డాక్టర్ గా వుండక్కర్లేదు. కానీ స్నేహితునిలా వుండనంటే చంపేస్తా!" అన్నాడు. అతని ఆప్యాయతకు చలించిపోయాడు. ఇన్నాళ్ళు ఇతను తన కుటుంబాన్నే ప్రేమిస్తాడనుకున్నాడు. కాదు ఇతను అందర్నీ ప్రేమిస్తాడు. అందరినీ ఆదరిస్తాడు. నిజమే! ఇతను ప్రేమైక జీవి. కళ్ళల్లో చిప్పిల్లిన భాష్పాలను చేతి రుమాలుతో ఒత్తుకుంటూ కృష్ణ కిరణ్ ను కౌగిలించుకున్నాడు. సూర్యుడు తన కిరణాలతో జగత్తును వెలుగులో నింపుతాడు. అలాగే కృష్ణ కిరణ్ తన చుట్టూ మానవత్వ కిరణాలను చంద్రుడు వెన్నెలను పరిచినట్లు పరుస్తూనే వుంటాడు. ఆ వెన్నెలలో కరిగిపోతూ మనమూ అలా మారాలని ప్రయత్నించడమే మన పని. సమాప్తం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి