7, జులై 2025, సోమవారం

అక్షరం బంధాలను కొలిచే సాధనం అనుబంధాలను తెలిపే మీటరు అనురాగాన్ని చూపగలిగే పరవశం భాషను మలవగలిగే శిల్పం * గూర్ఖా నిశిరాత్రి నిశ్శబ్దం పన్నెండు గంటల వేళ మధ్య మధ్యలో ఉన్నట్లుండి ఆకాశంలో మెరిసే మెరుపులు కుక్కల అరుపులు వణుకు పుట్టించే చలి సందిట్లో సడేమియాలా దోమల బెడద విదిలించినా ముసురుతూనే వీడని నీడలా ఓ ప్రక్క నుంచీ మురికి కాలువ వాసన భార్యా బిడ్డల కోసం జీవన భత్యం కోసమైనా మన రక్షణ దాగుందిగా ఎంత త్యాగమయుడు ? గుర్తించాల్సిన బాధ్యత మనదే ! * నానీలు స్కూటర్కి తగిలించిన హెల్మెట్ ఎదిరించునా మృత్యువును!? * సమస్య ఓ పరీక్ష పరిష్కారం ఓ సమాధానం జీవితానికి అదే ఆధారం * జారుడు మెట్లు వ్యసనాలు నిచ్చెన మెట్లు మంచి అలవాట్లు * అబ్బాయి అమ్మాయి ప్రేమ ఒకటవ తరగతిలోనే!అవ్వ!అవ్వ! * అమృత జలాల ఆనందతీర్థం పుణ్యతీర్థం పుష్కరస్నానం * వైకల్యం శరీరానికే మనసుకు లేదే ప్రయత్నిస్తే అంతా సఫలమే! * మీకు మీరే ధైర్యం! పున్నమి వెన్నెల పుచ్చ పువ్వులా కాంతులీనుతోంది. అదేమిటో వెన్నెల చల్లదనం కూడా వేడిగా తగులుతోంది మనసుకు. మరి కరోనా భయం వెన్నాడుతోంది. ఎక్కడ ఏ రూపంలో అది మనల్ని చుట్టుకొని మృత్యువుకు దరిచేరుస్తుందో అని దుగ్ధ. బ్రతుకు మీద వ్యామోహం ఎవరికి ఉండదు? అందుకే లోలోపలే కుమిలిపోతున్నాడు కార్తీక్. ఇన్నాళ్ళూ అమ్మ "అనూహ్య" ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. పబ్బులు డేటింగ్లతో కాలాన్ని వృధా చేసుకునేవాడు. పిజ్జాలు,బర్గర్లతో కడుపును పాడు చేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ మానేశాడు. ఆరోగ్యంగా హాయిగా ఉన్నాడు. అమ్మ చెప్పిందాంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు అర్థమైంది. మన సంస్కృతి సాంప్రదాయాలు వదిలేసి విదేశీ సంస్కృతి వైపు అడుగులు వేసినందుకు తన చెప్పుతో తనే కొట్టుకోవాలన్నంత కసిగా ఉంది. ఇంత మారానని కరోనా తన దగ్గరకు రాకుండా ఉంటుందా ?ఏమో? " రాదు రా! నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళకు.చేతులు శుభ్రంగా కడుక్కో .అత్యవసరమై బయటకు వెళితే ముందు జాగ్రత్తగా మాస్క్ వేసుకో చాలు" అంటుంది అమ్మ. అమ్మ ప్రక్కనే ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆవిడకు చావు భయం లేదు. కరోనా మీద కంటే ఆమెకు ఆమె మీదే నమ్మకం ఎక్కువ.మరి తను కూడా అలాగే ఉండాలి. ధైర్యం తెచ్చుకున్నాడు మీరు కూడా కదూ! (కరోనా సమయంలో రాసిన కథ.ఇప్పటికీ ఉపయోగపడే సందేశం) * సన్మానాలు సాహిత్యకృషికి అడగకుండా వచ్చే బహుమానాలు ప్రతిభకు తార్కాణాలు కళకు పట్టాభిషేకం కృషికి కొలబద్దలు పట్టుదలకు ప్రతిబింబాలు విజయాలకు సంకేతాలు ఉత్సాహాన్ని పెంపొందించే ఆనవాళ్లు నిజాయితీకి నిదర్శనాలు న్యాయానికి ప్రతీకలు వెలకట్టలేని నిర్వచనాలు * నీవు నన్ను ..! నీవు నన్ను ప్రేమిస్తే జగాన్నంతా జయించినట్లే నీవు నన్ను కాదంటే లోకమంతా చీకటే నిన్ను తప్ప నా కనులు మరేమీ చూడనని మారాం నీవు లేని జీవితం అంతా శూన్యమే నీతో ఆ పాతాళమయినా నా పాలిట స్వర్గమే నీవు లేని వైకుంఠమైనా పాడుపడిన దుర్గమే నీవు నన్ను వలదన్నా నా ప్రేమ నిను వీడదే నీవు నన్ను వీడితే నాకు ఊపిరాడదే * అమాయకత్వం అమాయకత్వం.. ఈ రోజు అదే పిలవ బడుతోంది చేతకాని తనంగా మంచితనానికిదా బిరుదు? ఏం చేస్తాం? లోకం మారిపోయింది చెడు రాజ్యమేలుతోంది ముసుగు వేసుకున్న వాళ్ళు నటనలో జీవించే వాళ్లే అత్మీయులు ఆలింగనాలు అన్నీ వారికే సొంతం చీత్కారాలు అసలైన వారికి కానుకలు నిజమైన ప్రేమకు దక్కిన ఫలితం స్వచ్ఛత కివి రోజులు కావు అందరినీ నిస్వార్థంగా ప్రేమిద్దాం నా అనుకునేవారే వెలివేయబడుతున్నారు ఏం ప్రారబ్దమో కదా ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి అమాయకులులా ఉంటారా ఉండరా అనేది * అపురూప ప్రేమ ఎవరెస్ట్ శిఖరాన నేను మనసునిండా ప్రేమ మంచు కప్పుకుని నను కరిగించే కావ్య కన్నియ కోసం ఎదురుచూపుల పర్వంలో నా చూపుల నక్షత్రాలు తాకని స్థలం భువిన లేదు నాకై స్పృష్టించిన చెలి ఎక్కడ దాక్కుందో మరి స్వార్థం లేని స్వచ్ఛత నిండిన నా మది వెతుకులాటలో అలసిపోయిన వేళ చూపుల ఆకాశంలో నా చెంతనే నిలిచిందో యవ్వని నాకై చేతులు చాచి నోరారా ప్రియా అని పిలుస్తూ అందమంతా రంగరించి పోసిన శిల్పంలా నిలబడ్డ ఆమె చెంతకు క్షణం లో చేరువయ్యాను కౌగిలిలో కరిగిపోయాను ప్రేమికుల దినోత్సవాన్న ఈ మా కలయిక అపురూపమేగా! * నా కూతురు బంగారం అనురాగం వెచ్చని స్వెర్టర్ రూపంలో పలుకు ముత్యాల మూటగా ఆప్యాయత నిధి బహుమతిగా అనుభూతి అల లా ఇష్టం ఆకాశాన్ని మరిపించేట్లు అభిమానం కొండంత అండగా బాధ కన్నీటి ధారలుగా ప్రేమ ఆనంద భాష్పాలై వీడని బంధానికి గుర్తుగా అభివ్యక్తం అణువణువునా ఇంతకన్నా ఏం చెప్పను? * ప్రేమంటే..!? అరే! ప్రేమంటే తెలియదా ? మీకూ అనుభవంలోకి వస్తుంది ఒకనాడు.. ఆనాడు .. ఆనాడు పక్రతి ఎండాకాలంలో చిగురించినట్లు ఎండమావులు మంచి నీటి చెరువుల్లా నీలాకాశం ప్రేమ నిలయంలా నక్షత్రాలు ప్రేమ హారాలులా చంద్రుడు పురోహితుడి లా ఊహ.. ఊహ.. ఊహ అంతా ఊహలే జీవితం వడ్డించిన విస్తరిలా? కడుపార ఆరగిస్తే మిగిలేవి ప్రేమానుభవాలే! * నీ నేస్తంగా..! ఊపిరి పోయేదాకా వీడనిది స్నేహం కట్టెల్లో కాలిపోతున్నా కరగనిది స్నేహం విడరానిది స్నేహబంధం నీ కోరికతో బంధాన్ని కలిపాను నా స్నేహ హస్తాన్ని నిర్మలంగా మిగల్చాలి కలకాలం ఈ నేస్తాన్ని నీ నేస్తంగా ఎప్పటికీ ఆదరించాలి * అక్షరజనని నచ్చింది చూడగానే.. చేతుల్లోకి తీసుకున్నా పసిపాపలా ఎంత మెత్తగా రాస్తోందో గాలి సుతిమెత్తగా తాకినట్లు సంతోషతరంగాలను మోసుకెళ్తున్నట్లు నక్షత్రాలను తనలో ఇముడ్చుకున్నట్లు పచ్చదనాన్ని అంతరించుకున్నట్లు రూపం మరెంత బాగుందో!? మనసు ఆలోచనల పరుగులు అందమైన అక్షరాలతో నడిపిస్తూ చలాకీతనాన్ని అణువణువునా నింపుకుంది కాగితంతో స్నేహాన్ని జత చేసుకుంది కదా నీకు తోడు నేనే అన్నట్లు.. ఇంకేముంది కవిత్వం పొంగి పొర్లింది కథనం కొత్త రూపు తెచ్చుకుంది లేఖిని నడకలో నవల నెమలిలా నాట్యమాడింది వర్ణిక కళ్ళు మిలమిలా మెరిసాయి మరి ఆత్మసంతృప్తి అంతా వర్ణమాతదేగా! * గేయం శంకరా! లోకాన్ని ఏలేటి శంకరా భక్తవ శంకరా బ్రహ్మ విష్ణులకే నీ మహిమ తెలిపిన సర్వేశ్వరా జీవి అయినా, ప్రాణి అయినా మిత్రువయినా శత్రువయినా నినుకొలిచిన చాలు కదా ముక్తిని ప్రసాదించే బాంధవుడివే కాసింత భక్తి చూపిస్తే చాలు అడిగినంత ఇచ్చేసే స్వామివి భోళాశంకరుడిగా నీ పేరు చిరస్థాయిగా ఈ నేలన నిలిచేనులే * ఎన్నెన్ని జ్ఞాపకాలో..! మది పుస్తకాన్ని ఓసారి తెరిచా ఎన్నెన్ని జ్ఞాపకాల జావళీలో ముత్యాల తలంబ్రాలు మోమున జారిన వైనం చినుకులలో తడిచిన చందం లెక్క రాగాల సరాగాల నావలో ప్రయాణాలు తెడ్డల్లే ఆసరాగా నిలబడ్డ సహచరుడు ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు నింపుకున్న వైనం పాతికేళ్లు పెంచిన పిల్లను పంపక తప్పనప్పుడు నాన్న మనసులోనే ఖైదీలుగా మిగిలిన కన్నీటి చుక్కలు తమ్ముళ్ల ఆరాధన నిండిన కళ్ళనిండా సముద్రాలు తోడు జారిపోతోందని చెల్లి మనసున భావనాక్షరాలు ఎందుకు నేనే వెళ్లాలన్న ప్రశ్న నా వెంటే! * నీ క్రోథం తగ్గించుకో క్రోధి నామ సంవత్సరమా నీ క్రోధాన్ని మాపై చూపించబోకు అసలే అజ్ఞానులమై నిలుచున్న చెట్టునే నరుక్కుంటున్నాం నీడ,శ్వాసకు కారణమని తెలిసినా కుటుంబాల మధ్య కలతలే వద్ధనుకుంటుంటే రాష్ట్రాలు,దేశాల మధ్య యుద్దాలని మరింత భయపెడతావేం? అసలే మనిషి మనిషి మధ్య ప్రేమ వంతెనలు లేక అల్లాడిపోతున్నాం జరుగుతున్న అరచికాలు చాలవా మరిన్ని మాకెందుకు నీ సంతోషాన్ని మాకు పంచు సదా నీ ఆశిస్సులనే మాకు అందించు తల్లీ! ఇదే నా అభిలాష! * నాటి-నేటి నాయకుడు నిస్వార్ధపు దారిలో నీ అడుగులు స్వార్ధపు పడగ నీడన ఈ నాటి నాయకులు అహింస ఆయుధంగా నీ చేతలు హింసే పరమార్థంగా ఇప్పటి వారి పరుగులు నిరాడంబరత్వం నీకు భూషణమయితే షోకులు, షికార్లు వీరి ఆశయాలు నాదేశం .. నాదేశమని ప్రాకులాట నీది నాది,నా ఎదుగుదల వెదుకులాట వెతలు వీరివి ఒంటి మీద మన ఖద్దరు బట్టనేది నీ సిద్దాంతం పీలికలే.. పరమార్థమనేది నేటి మాట మారిన ఈ ప్రజానీకాన్ని చూస్తే చింత ఈ అవినీతి లోకం లో ఉండాలంటే మంట అసలు ఓటరుగా ఓటెయ్యాలంటేనే తంటా! * మనిషిగా బ్రతకాలంటే..!? అందరితో ప్రేమగా ఉండాలనుకుంటా ఒకరు డబ్బు చూస్తారు మరొకరు కులం చూస్తారు ఇంకొకరు వయసు చూస్తారు చాలా వరకు అందం చూస్తారు ఆప్యాయత పంచటానికి ఏమి చూడాలి? మనసు వేసిన ప్రశ్న ఠక్కున చెప్పింది అంతరంగం ఎదుటి హృదయపు స్పందనని మనల్ని చూడగానే పువ్వులా విచ్చుకునే పెదాలు చిరునవ్వు బహుమతి అంతకంటే ఏం కావాలి? చల్లటి మాట చిక్కటి స్నేహం వెంట వెంటనే వచ్చే పరిమళాలు ఆ సుగంధం సువాసన అందుకునేవారికే తెలుస్తుంది ఏమంటారు? కాదనగలరా ? మరెందుకు ఆలశ్యం? మీరూ అలా స్నేహపాత్రులుకండి ఎద ఎదలో రవ్వంత సఖ్యత కాస్తంత జాలి మరి కొంత మానవత్వం మనిషిగా బ్రతకాలంటే ఇది చాలు! * ఎన్నాళ్ళకెన్నాళ్ల కు..!? మది ఆనంద సంద్రంలో మనసు ఉత్సాహపు ఉరకలు సంతోషపు సంబరం ఎదలో భూమి తల్లి చినుకు బిడ్డను హత్తుకుంటుంటే మబ్బు మెరుపును ముద్దాడుతుంటే చెట్ల నాట్యాలు చూస్తుంటే ఎండాకాలంలో వర్షం హర్షమే కదా! * దగ్గరే..దూరంగానే! ముఖ పుస్తకంలో మధురమైన కబుర్లు స్నేహితులతో మందు బిళ్ళలు తేలేదని అమ్మ ప్రశ్న పక్క గదిలోంచి వాట్సాప్ లోనే సమాధానం తెస్తాలే అని ఎక్కడ ఉన్నా చెవుల్లో ఇయర్ ఫోన్స్ మాటలు లేని మౌనమే ఇంట్లో ఎంతమంది ఉన్నా నిశ్శబ్ద రాగమే దేశానికి విదేశానికి ఇప్పుడు పెద్ద తేడా లేదు ఎంత అభివృద్ధి ఊహించనంత ఎత్తులో 'సెల్లు' తెచ్చిన తంటాలే ఇవన్నీ! * అబ్బో!అబ్బబ్బో!మగవాళ్ళు! మగవాళ్ళ టక్కులు,తైతెక్కలు ఎరుగని వారెవరు? వయసులో ఉన్న వారైనా ముదుసలులైనా ఆడవారు కనిపిస్తే చాలు వయసుతో సంబంధమే లేదు భార్యల సంగతే మరుస్తారు ఇంతింతని అంతంతని పొగడ్తల వర్షం తడిసే బదులు దూరం పెడతారని తెలియని వైనం ఇదే తంతు శ్రీమతికి ఎదురైతే ఆ ఒక్క ఆలోచన చాలు కాళ్లకు బ్రేకులు పడటానికి మరి ఆ సంగతి మరిచారా పురుషపుంగవులూ! * దిన దిన ప్రవర్ధమానం లక్ష్యం చేరటం అన్నది సులభమేం కాదు పట్టుదల దృఢంగా శ్రమ నిరంతరంగా కృషి అచంచలంగా ఆలోచన అంచెలంచెలుగా పయనం మునుముందుకు నీ లక్షణాలైతే గమ్యం నీకు చేరువలోనే దినదిన ప్రవర్ధమానం నీ సొంతమే! * ఆడపిల్ల పెళ్లి అవ్వకముందు సంపాదన నాది పెళ్లయ్యాక డబ్బులు మావి మరి తల్లిదండ్రులకీ..!? * ఈ ఉదయం నీరెండ వెన్నెలలా పరుచుకుంటున్న వేళ నిశ్శబ్దం నలుమూలలా సంచరిస్తున్న సమయం మనుషులతో సమానంగా కార్లు ఉన్న ముంగిళ్ళు ఎటు చూసినా శుభ్రత విరాజిల్లుతున్న లోగిళ్ళు ప్రకృతి మౌనంగా సంభాషిస్తున్న తరుణం ఇది కదా నేను మొదటి చూసిన టెమికులా * అదేమిటో (? కొందరికి నిలువెల్లా స్వార్థం పిల్లలకు కూడా వారసత్వంగా! శాంతం దయాగుణం మానవత్వం కరుణతత్వం/ అణువణువునా ఇంకొందరికి! ఒకే తల్లికి పుట్టినా ఒకే రక్తం పంచుకున్నా ఎందుకో ఈ తేడాలు ఈ తారతమ్యాలు భగవంతుని సృష్టిలా! * పాఠం ప్రాతఃకాల వేళ కొండలన్నీ మంచు చీర కప్పుకున్నాయి శీతలం ఆవరించింది మరి పగలంతా సూర్యుని ప్రతాపం దగ్గరగా ఉన్నామని కృప ఎక్కువ చూపిస్తున్నాడు జీవితానికి ఆటుపోట్లు తప్పవన్నట్లు ప్రకృతి మాత ఏమిచ్చినా అందిపుచ్చుకోవాలి మనవరాలితో ముచ్చట్లు అచ్చట్లు కబుర్లు వెచ్చని స్వెట్లరులా, చల్లగాలిలా సమస్యకు పరిష్కారం వెతకాలే కానీ ఎప్పుడూ అందుబాటు లోనే అమెరికా అయినా ఇండియా ఐనా ! మనమంతా ఒకటే! మతం మతం అంటూ మదిలో మధనపడతావెందుకు? అల్లా అయినా రాముడయినా ఇలవేల్పు అనే విస్మరణ నీ కెందుకు ? గుడి అయినా మసీదు అయినా దేవుని నెలవే బీబీనాంచారిని చేపట్టిన వేంకటేశ్వరునికి ఈ ఆలోచన లేదే? ఆ రీతిలో మనమంతా భాయీ భాయీ అనుకుంటే అంతటా ఆనందమేనోయ్! * భూమాత పరిరక్షణ ఇంటి చుట్టూ పెరడు మన అభిలాష కావాలి ప్లాస్టిక్ నిషేధం మన ఆశయం అవ్వాలి అభివృద్ధి అపార్ట్ మెంటులు ఆలోచనకే దూరమవ్వాలి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భూమాత పరిరక్షణ కావాలంటే వస్తుందా? పచ్చదనం పసిడి తనం మాట గుర్తుంచుకోవాలి కలకాలం నేలను అమ్మలా చూసుకోవాలి లాలనగా కాపాడాలి మాత చల్లని చూపు అనునిత్యం జగతి మీద ప్రసరించాలి అదంతా మన చేతుల్లోనే.. మన చేతల్లోనే! * గుర్తెరుగు ఉషోదయాన ఎండలో నిలబడ్డా ఎందుకో వెనకకు తిరిగా నా నీడ నాకంటే పొడవుగా అంతమాత్రాన నేను పొడవయిపోతానా? మన గురించి ఎవరన్నా పొగిడినా అంతే ఉన్నది చెబితే ప్రశంస లేనిది కల్పించి చెబితే నీకు అగడ్తే రెండింటి మధ్య చిన్న బేధం తెలుసుకొని మసలాలి తెలివిగా లేదంటే ఎదుటివారి మాటల్లో చేతల్లో నీకు నీవే బలి సుమా! * శ్రీ విఘ్నేశ్వరా! విఘ్నముల పారద్రోలే ప్రధమ పూజ్యుడు శ్రీ వినాయకా శతసహస్ర వందనములు తల్లితండ్రుల మించి ఎవరు లేరని సందేశమిచ్చిన లోక సంరక్షకా నేడు అదే కానరావడం లేదని వగచె నా మనసు అదియె ఉన్న వృద్ధాశ్రమాలకు తావేది? నేటి యువతకు మంచి మనసు ఇవ్వు ఆడవారిని గౌరవించే సంస్కారమివ్వు సకల దేవతలు నిను ప్రార్ధింతురే దైవాలకే దేవుడివి నిను స్తుతింప మా తరమా ? * ఓ అంతరాత్మా! నీ మనసున ఎల్లప్పుడూ చెడు ఆలోచనలే మంచికి తావే లేదు తల్లితండ్రుల మించి ఎవరు లేరని తెలిసినా పట్టించుకోవు నేడు అదే కానరావడం లేదని వగచె నా హృదయం అదియె ఉన్న వృద్ధాశ్రమాలకు తావేది? నేటి యువతకు మంచితనాన్ని ప్రసాదించు ఆడవారిని గౌరవించే సంస్కారమివ్వు భరతమాత గర్వించేలా మేలు చేసే గుణాన్నివ్వు * ఆశాదీపం ఆశల సౌధం పైన అరక్షణం ఊగానో లేదో అగాధం అంచులు పలకరించాయి నిస్సహాయత అక్కలా నిరుత్సాహం చెల్లిలా చుట్టేశాయ్! ప్రోత్సాహపు నిచ్చెన కరువే ! ఆత్మహత్య తలపు తట్టింది తులాభారం .. మనసు మధనం ప్రారంభం చావటంలో అసహాయత తప్ప ఏముంది? ఎదురీదటంలో గొప్పతనం ఉందని అంతరంగం దూరంగా ఓ వెలుగు చుక్క ఓ..కేక చీకటి సమస్యకు ఒక ఆశ అంత కన్నా ఇంకేం కావాలి? బ్రతుకును ఈదటానికి * నేను - తను రాలిన ఆకు దీనంగా నా స్నేహితురాలి కళ్ళకు తృప్తి నిండిన మనసుతో అదేమిటో నాకు ఇరువురి భావాలూ ఉత్తర దక్షిణ ధ్రువాలులా చూసేది ఒకటే ప్రకృతి కల్లోలంగా తనకు సంతోషంగా నాకు అలలు తీరాన్ని ముద్దాడుతున్నాయి అంటాను నేను రాపిడితో అలిసిపోయి వెనుతిరుగుతున్నాయి అంటుంది తను ఏది కనులకు కట్టినా అదే వైఖిరి కవిత్వం జీవిత ప్రతిబింబమేమో! * ప్రకృతి మాతా! ఏవీ కొండలు కోనలు మంచుతో కప్పబడి మాయ మాయనే ఎండైనా తీవ్రమే చలి అయినా కష్టమే ప్రకృతి మాతా మా మీద దయ చూపవే సమతలం చూపమ్మా తక్కువా మాకొద్దు ఎక్కువ మాకొద్దు అమ్మలా కరుణించి కాపాడు! * గెలుపు పాఠం ఓడిపోతేనేగా గెలుపుకి అర్థం తెలిసేది ఒక మెట్టు కిందకు జారితే దిగులుపడకు తొందరపడి రెండింతల సాహసానికి చక్కటి దారి ఇచ్చిందనుకో కృషి నీలో నాటుకు పోతే మొలక మొక్కై పుష్పించటం ఎంతసేపు? పట్టుదల నీకు తోడైతే విజయం చెంత చేరినట్లే అనుకో ! * జాగ్రత్త జెండా! బ్రహ్మి ముహూర్త సమయమే ప్రియుని స్పర్శలా గిలిగింతలు లేవు చల్లగాలిలో కాలుష్యపు వేడి సెగ ఎప్పటిలా సంతోషపు వెల్లువ లేదు నా మదిలో ఎక్కడో జరుగుతోందని తెలుసు నా దాకా రాలేదని ఆనందపడ్డా ఇన్నాళ్ళూ ఆ ఉపద్రవం దరి చేరింది అన్నమాట మరి మా వీధిలోనే వెలిశాయి ఆరు అపార్ట్మెంట్లు రాదా ఈ మార్పు ? తస్మాత్ జాగ్రత్త జెండా ఎగురవేసా నా ఎదపైన మీకు కూడా అని వేరే చెప్పక్కర్లేదు గా! * భవిష్య చిత్రపటం బూడిద వర్ణంలో ఆకాశం ఏ నిమిషానన్నా ఉధృతంగా వర్షం కురుస్తుందన్న సూచనతో ఎగురుతున్న గాలిపటం భవిష్యత్తులా చినుకు కోసం ఎదురుచూపులు పర్వంలో రైతులా నేను! * తండ్రి-బిడ్డ చిన్ననాడు నిన్ను తిప్పినాడు నీ తండ్రి ఈనాడు అదే చందంన కొడుకు తోడ పిత్రుని తిప్పె తనయుడు సంఘటన చిన్నదే ఎందరికో స్ఫూర్తి ఈనాటి యువకులకు మరీనూ! * నేల సింగారాలు మనం అందుకోలేని సింగారాలు మనకోసమే నేలకు దిగి వచ్చిన బంగారాలు భగవంతుని సృష్టి ఎంత గొప్పదో కదా అంత ఎత్తున నిలబెట్టినా తనంతటతానే క్రిందకు జారే సౌలభ్యం సొంతం చేసిన ఘనుడు ఎందరివో మనసులు దోచిన ఆకాశ పుష్పాలు చిన్ననాటి నుంచి నను మురిపించే మధుర నేస్తాలు రోడ్డున ఎక్కడ కనిపించినా పలకరింపుల పల్లవులే కనులకు ఆహ్లాదపు విందులే కవిత్వం అబ్బిన నేను కవిత్రీకరించకపోతే ఎలా? * కథ లోకం తీరు మారాలి ఊహ తన ప్రియుడిని తలుచుకుంటూ ఊయలలో పరవశిస్తూ విహరిస్తోంది. ఇంద్రధనస్సులా ఆమె అతని అందమైన పరిష్వంగంలో ఒదిగిపోతుంది.తను అందాల రాశి.అతను ఆరడుగుల అందగాడు,ఐశ్వర్యవంతుడు. అలాంటి వాడి ప్రేమ ఓ మధ్య తరగతికి చెందిన తనకు దక్కటం ఎంత అదృష్టం? నవలా రచయిత్రి "ఆనంద వాహిని"అంటే తనకెంతో ఇష్టం.ఆమె నవలల్లో నాయిక ఎప్పుడూ మధ్యతరగతి వనితే.కానీ వ్యక్తిత్వం మాత్రం హిమాలయ శిఖరం అంత.అందుకే అందగాడు,ధనవంతుడైన అబ్బాయి ఆమెకు దాసోహమై అన్ని కష్టాలను అధిగమించి ఆమెకు చేరువవుతాడు.ఎక్కువగా ఆమె రచనలన్నీ ఇలాగే ఉండేవి.చిన్నతనం నుంచి వాటికి చేరువగా పెరిగిందేమో ఊహ అలాగే ఊహిస్తూ ఉండేది.కాకపోతే ఆమె ఆలోచనలు అన్నీ కలలుగానే మిగిలిపోయాయి.అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది పెళ్లి కాలేదని. ఆమె అమ్మగా వాస్తవికతకు దూరంగా రచనలు చేసిన ఆ రచయిత్రి పిచ్చిదయింది ఆ వార్తను తట్టుకోలేక. రచనలు వాస్తవానికి దగ్గరగా ఉండాలనే చిన్న విషయం తెలుసుకోలేని దాన్నయ్యానే అనే బాధతో నేను. * మనిషిగా బ్రతకాలంటే..!? అందరితో ప్రేమగా ఉండాలనుకుంటా ఒకరు డబ్బు చూస్తారు మరొకరు కులం చూస్తారు ఇంకొకరు వయసు చూస్తారు చాలా వరకు అందం చూస్తారు ఆప్యాయత పంచటానికి ఏమి చూడాలి? మనసు వేసిన ప్రశ్న ఠక్కున చెప్పింది అంతరంగం ఎదుటి హృదయపు స్పందనని మనల్ని చూడగానే పువ్వులా విచ్చుకునే పెదాలు చిరునవ్వు బహుమతి అంతకంటే ఏం కావాలి? చల్లటి మాట చిక్కటి స్నేహం వెంట వెంటనే వచ్చే పరిమళాలు ఆ సుగంధం సువాసన అందుకునేవారికే తెలుస్తుంది ఏమంటారు? కాదనగలరా ? మరెందుకు ఆలశ్యం? మీరూ అలా స్నేహపాత్రులుకండి ఎద ఎదలో రవ్వంత సఖ్యత కాస్తంత జాలి మరి కొంత మానవత్వం మనిషిగా బ్రతకాలంటే ఇది చాలు! * మట్టి పరిమళం నింగి నేలను తాకదని ఎవరన్నారు? చినుకు రూపం లో దరిచేరునుగా మట్టిపరిమళాన్ని పరిశరాలకు జత చేయునుగా మనిషి అక్షరజ్ఞానాన్ని మెదడున మొలకెత్తించినట్లు పుస్తక సుగంధాన్ని వెదజల్లినట్లు ప్రకృతి మనిషి తోడూ నీడగా నిరంతర ప్రయాణం సాగునుగా! * పసిపాపలు చక్రాల్లాంటి చురుకైన కళ్ళు చూపుల వేటలో కబుర్లు ఉరుకుల పరుగుల సందడి మాటల పోగుల మూటలు మోయగలిగి నంత అందుకోవటమే ! * జ్ఞాపకాల అలలు అలల మీద అలలు తుంపరల్లా పడి తడి జ్ఞాపకాలను గుర్తు తెస్తూ .. ! * కథ సమిధ నై ..! భూమి తల్లి దాహం తీర్చడానికి తన వంతు సాయంగా మేఘం వర్షించింది . హమ్మయ్య అనుకుంది ఆ తల్లి హృదయం . కానీ ఈ కలికాలంలో స్త్రీని ఊరడించే వాళ్లే కరవు . ఆరడి పెట్టే వాళ్లే ఎక్కువ . ఇది ఒంటరి మహిళలకు మరీ ఎదురయ్యే సమస్య * * * " వినతి " విధులను ముగించుకొని ఇంటిదారి పట్టింది . బాబు బడి నుండి ఇంటికి వచ్చేసి ఉంటాడు . తనకు ఆఫీసులో చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో ఆలస్యమైంది . ఒంటరిగా వాడేలా ఉన్నాడో ఏమో అనే కంగారులో నడక వేగాన్ని పెంచింది . "ఆంటీ ఈ రాత్రికి రానా ? " వెంటపడ్డాడు ఒకడు . వాడి మాటకు హృదయంలో నుంచి తన్నుకొచ్చింది బాధ . వెనక్కి తిరిగి చెప్పుచ్చుకొని కొట్టాలనిపించింది . మళ్ళీ విజ్ఞత ఆమెను మేల్కొల్పింది. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయి . వాటిని పట్టించుకోకూడదు అనుకుంది మనసులోనే . ఆమె మౌనం అతనికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. " ఎన్నింటికి రాను ? " మరో ప్రశ్న బాణంలా దూసుకు వచ్చింది . " ఇక సహనం చూపించలేకపోయింది . మా తమ్ముడు కూడా ఖాళీగా ఉన్నాడు . మీ చెల్లిని కూడా తీసుకురా "అంది . అంతే ..గోడకు కొట్టిన బంతిలా వెను తిరిగి వెళ్ళిపోయాడు . వెధవకి తిక్క కుదిరింది అని కసిగా నవ్వుకుంది . అల్లంత దూరంలో ఉండగానే కొడుకు వచ్చి కావలించుకున్నాడు . "ఏమ్మా ఇంత ఆలస్యమైంది ? " అంటూ. " రా నాన్నా.. లోపలికి వెళ్లి తింటూ మాట్లాడుకుందాం " అంటూ తాళం తీసి వాడిని మాటల్లో పెట్టింది . ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇదే పని . ఆఫీసులో పని ఒత్తిడి ఎంత ఎక్కువ ఉన్నా తనకు బాధ ఉండదు . ఈ సూటిపోటి మాటలే భాణాల్లా గుచ్చుకుంటూంటాయి . భర్త దేశం కోసం పోరాడి సైనికునిగా వీరమరణం పొందింతే భార్యగా ఈ దేశ జనం తనకిస్తున్న విలువను చూస్తే నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధార పోసాను అని మనసులోనే రోదించింది ఆమె హృదయం . మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బిల్డింగులో ఈ విషయాన్ని తెలియజేస్తూ! * అనుకున్నది అనుభవమైతే..! మహా కుంభమేళ సుప్రసిద్ధ క్షేత్రం 'ప్రయాగరాజ్ లో ప్రారంభమవుతోంది అన్న విషయం తెలిసినప్పటి నుంచీ ఎంతో ఉత్కంఠ. 140 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఈ మహోత్సవం మీద దృష్టి ఎక్కువయింది. ఇది 45 రోజుల పండుగ. కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేసి తమ పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించిన శుభ సమాచారం. ఎందరో అఘోరాలు, నాగ సాధువులు ఎక్కడినుంచి వస్తున్నారో ఎక్కడ మాయమవుతున్నారో తెలియటం లేదని విలేఖరుల వార్తలు సంభ్రమంలో ముంచెత్తుతున్నాయి. చాలామంది వీరిని చూడటానికి కూడా వెళ్తున్నారట. ఒంటి మీద నూలు పోగైనా లేకుండా వణికించే చలిలో స్నానానికి వారు వస్తుంటారట. వారికై ప్రత్యేక స్నాన సమయం కూడా ఉంటుందని ప్రారంభమైన దగ్గర్నుంచి అన్ని వార్తల్లో వింటూ చూస్తూనే ఉన్నాను. దేవతలు రాక్షసులు అమృతం కోసం కొట్టుకునే సమయంలో విష్ణువు మోహినీ అవతారంలో అమృతాన్ని పట్టికెళుతుంటే నాలుగు చుక్కలు హరిద్వార్, ప్రయోగరాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయని చెబుతారు. ఇలాంటివి విన్నప్పుడు మన భరతభూమి గొప్పతనం హిమాలయ శిఖరం అంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నా గురించి చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం వెతుక్కునేతత్వం. ఆ సందడి ఆ పండుగ చూస్తుంటే వెళ్లాలని ఓవైపు మనసు లాగుతోంది అదే సమయంలో అక్కడ తోపులాటలు మరణాలు చూసి అవసరమా అని అంతరంగం వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేక సతమతమయ్యాను. చిన్ననాడు చదివిన కథల్లో లేపనం రాసుకొని వాళ్లకు కావాల్సిన స్థలాలకు వెళ్లిపోతుంటారు అని చదివాను. అది దొరికితే ఎంత బాగుంటుంది అని ఇప్పటికీ అనిపిస్తుంది. అందుకని వారిని వెతుక్కుంటూ రుషికేష్ కి వెళ్లే పరిస్థితి కాదు.మరి ఏం చేయాలి? మా కాలనీలో వాళ్ళు అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చారు. వాటిని కలుపుకొని ఇంటిల్లపాది స్నానం చేసాము. అయినా నా కుతి తీరటం లేదు.ఏ అఘోరానో నన్ను తీసుకెళ్లి ప్రయాగ్రాజ్ లో ముంచి ఇక్కడ వదిలిపెడితే ఎంత బాగుంటుంది అనుకున్నాను.అది జరిగే పని కాదని తెలిసినా. ఆశ అలా ఆశ పెడుతూనే ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. మా వారు అడగనే అడిగారు వెళ్దామంటే తీసుకువెళ్తానని. ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ వలన బస్సులు ఆపేస్తున్నారని, అది ఒకటిన్నర కిలోమీటర్ అని కొందరు, 17 కిలోమీటర్లు నడిచి వెళ్ళామని మరికొందరు, 45 కిలోమీటర్లకు రోజంతా బస్సులో ప్రయాణించమని, బుక్ చేసుకున్న రూమ్ కూడా పోయిందని మరికొందరు చెప్పే మాటలు వింటుంటే భయం వేసింది. కూర్చుని ప్రయాణం చేయలేను. అప్పుడే ఓ జంట లక్ష రూపాయలతో విమానంలో వెళ్తున్నామని, రెండు టికెట్లు ఉన్నాయని కూడా చెప్పారు. అప్పుడు అడిగినా కాదన్నాను. నా కాన్సైప్టే వేరు కదా! ముగింపు రోజులు ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక రెండు రోజులే. రోజూ మా టెర్రస్ మీద ఉదయం 20 నిమిషాలు ధ్యానం చేయడం నా అలవాటు. ముందు సూర్యనమస్కారం చేసి అప్పుడు ధ్యానంలోకి వెళ్తాను. అప్పుడే ఆయన్ని అడిగాను. భగవంతుడిని నా తండ్రిగా భావిస్తాను. అడక్కుండా అన్నీ ఇచ్చే ఆయన్ని కొన్ని కొన్ని అడిగి తీసుకుంటూ ఉంటాను. అలానే ఆరోజు కూడా అడిగేసాను. అఘోరాలకైతే నేను తెలియదు. నీకైతే నేను తెలుసు కదా. నువ్వు కూడా ఈ విషయంలో నన్ను పట్టించుకోవటం లేదు అని ఆయన్ని ప్రశ్నించాను. అది అత్యాస అని తెలిసినా. ఎప్పుడైనా ఎండలో బయటికి వెళ్తే తన వేడిని తగ్గించుకొని నాకోసం చల్లదనాన్ని పరిచే సూర్యుని దగ్గర ఆమాత్రం చనువు నాకు ఉండనే ఉంటుంది మరి. మర్నాడు ధ్యానంలో ఓ నామీద చిరు పూల జల్లులా వాన పడుతున్నట్లు తెలిసింది. తడి తగలటం లేదు కానీ చినుకు నా శరీరాన్ని తాకుతున్న స్పర్శ తెలుస్తోంది. ఆ అనుభూతి వర్ణించటానికి మాటలు చాలవు. అసలు ఇది నిజమేనా లేక బయట వాన వస్తోందా అన్న ప్రశ్న మరోపక్క నన్ను సందిగ్ధావస్థలో పడేసింది.ఆ అనుభూతిని మనసులో భద్రంగా భద్రపరుస్తూనే ధ్యానాన్ని ముగించాను. బయటకు రాగానే అక్కడే వాకింగ్ చేస్తున్న ఆమెను అడిగాను. ఇప్పుడు వర్షం వచ్చిందా అని.. లేదండీ అందామె. ఆమెతో మాట్లాడుతుంటే కూడా నా ఎడమ చేతి మీద రెండు సార్లు కుడి చేతి మీద మూడుసార్లు చినుకులు పడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. ఆమె కూడా నా చేతిని తడిమింది. చినుకు తడి తగులుతుందేమో చూద్దామని. లేదు. ఆమెకు నాకు కూడా తడి తగల్లేదు మరి. ఆ తర్వాత మనసాగక మాకు తెలిసిన దుర్గ గారు అనే ఆవిడకు ఫోన్ చేశాను. ఆవిడ పత్రీజీ గారి ఆశ్రమంలో ధ్యానం క్లాసులు తీసుకుంటూ ఉంటారు. నాకు ధ్యానంలో ఏది కనిపించినా ఆవిడకు చెప్పి దానికి అర్థం ఏమిటో తెలుసుకుంటూ ఉంటాను. ఆవిడ ప్రతిసారి చెప్పేవి అన్నీ నాకు తెలియనివి. తెలుసుకో తగ్గవి. అలాగే ఈరోజు చెప్పాను. ఆవిడ వెంటనే మీరు కుంభమేళా ప్రయాగరాజ్ లోస్నానం చేసి వచ్చినట్లు లెక్క అన్నారు. " నిజంగా(!" అన్నాను నేను. "నాకు తెలిసినంతవరకు అంతే అన్నారు" ఇక నా ఆనందం ఏమని చెప్పాలి? లోకానికి అంతా ఈ విషయం వెలుగెత్తి చెప్పాలనిపించింది. కొందరికి మాత్రం చెప్పాను. వారిలో ఒకరు దీనిని భ్రమగా తేల్చి పారేశారు. కొందరు లోపల అనుకున్నారేమో వాస్తవం కనిపిస్తున్నా! అయినా అలాంటి వారి సంగతి నాకెందుకు? నా కోరిక తీరింది. అదీ భగవంతుని ద్వారానే! నేను కోరుకున్న విధంగానే! నా జన్మ ధన్యమైనట్లే! అది చాలు. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా యదార్థ గాథే! * అర్థంలో పరమార్థం పక్కవాడు పడిపోతే లేపాలని ఒకరు చెప్పాలా? చూస్తూ పట్టనట్లు పోతే నువ్వూ మనిషివేనా? సందేహం రావాలి మరి ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకోక తప్పదు లోకమంతా ఇంతే నిన్ను నువ్వు అలా సమర్ధించుకోకు గొర్రెల మందలో గొర్రెవైతే గొప్పేముంది! కాపరివైనా కావాలి సహాయకారిగానైనా మిగలాలి అప్పుడే కదా జీవితానుకో అర్థం! * ఆకుపచ్చ నేస్తం నేను అమ్మ కడుపులోంచి బయటపడ్డా మా పెరట్లో కొబ్బరి చెట్టు వెలిసిందీ ఆ రోజే ఊహ తెలిసాక నా కదే మొదటి నేస్తముయింది రోజూ కబుర్లు అన్నీ మా ఇద్దరివే మూగదని మాటలు రానిదని అమ్మమ్మ తాతయ్య సుద్దులు నన్ను చూడగానే ఆకులన్నీ ఉల్లాసంగా ఊగుతాయని చల్లటి గాలి వింజామరలా వీసి మురిపిస్తుందని చెప్పినా నమ్మరే!? నా ఊపిరి ఉన్నంత వరకు మాస్నేహం నిలిచే ఉంటుంది ఇది నిత్యం ఇది సత్యం * ఒంటరి చీకట్లో కొవ్వొత్తి వెలుగుతోంది.దాన్ని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లే ఉంది రజినీగంధ కు.పెళ్లయి 30 సంవత్సరాలయింది.ఆనాటికి ఈనాటికి ఏమీ తేడా లేదు. యంత్రంలా తను పనిచేయటం వారు చేయించుకోవటం. తనదీ ఒక బ్రతికేనా అనిపిస్తూ ఉంటుంది.అయినా అందరిలా సగటు ఇల్లాలుగా బ్రతికేసింది.కానీ ఈరోజు అలా అనిపించటం లేదు.ఎదురుగుండా పురికోస త్రాడులా వేలాడుతోంది.తమ భార్యాభర్తలు బంధం కూడా అలాగే అనిపిస్తుంది ఆమెకి.ఇద్దరూ రెండు వైపులా పట్టుకుంటేనే కదా అది బంధంలా కనిపిస్తుంది.ఎంతసేపూ తను వాళ్లకోసం కొట్టుకోవటమే.అటువైపు నుంచి ఏ ప్రేమ కనిపించదు.పిల్లల వైపు నుంచి కూడా.ఈరోజు అది భరించలేని వ్యధలా తయారయింది. ప్రొద్దున్న వాళ్లకు దోసెలు వేసి పెడుతుంటే పొయ్యి ప్రక్కన ఉన్న స్టీల్ అట్లకాడను ముట్టుకుంది.వేడి పాల గిన్నె ప్రక్కన అది ఉందేమో సఋణ చెయ్యి కాలింది.అయినా ఎవరూ పట్టించుకోరు.అందరూ చూసి కూడా అలా వదిలేయటం ఆమె భరించలేకపోతోంది.అనుబంధం లేని ఈ బంధాన్ని వదులుకోవాలని నిశ్చయించుకుంది.అందరికీ ఇది చిన్న విషయంలా కనిపించవచ్చు.గాయం చిన్నదే అయినా మనసుకు తగిలిన దెబ్బ పెద్దది.దాని బాధ అనుభవించే వారికి తప్ప అన్యులకు అర్థం కాదు.అందుకే ఓ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది.దాంతో ఇంట్లో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.ఎక్కడికి వెళ్లిందని ఆమె గురించి విచారించటం ప్రారంభించారు.ఆమె మీద ప్రేమతో కాదు అవసరంతో. వెతికి పట్టుకున్నాక వారి ఉద్దేశం గ్రహించిన ఆమె తెగేసి చెప్పేసింది రానని. మంచిగా ఉంటామని చెప్పినా కాస్త ఆలోచించేదేమో(! * మనిషి - మనసు మనల్ని మనం శుభ్రం చేసుకున్నట్లు ప్రతి రోజూ మనసును కడిగేస్తే మంచిని ఉంచుకుంటూ చెడును త్రుంచుకుంటూ కల్మషాన్ని తుడుచుకుంటూ పోతే ఎంత బాగుంటుంది ? 'నీ' గురించి ఎంతో ఆలోచిస్తావు 'మన' కు మాత్రం స్థానం ఇవ్వవు అంత స్వార్థమా? ఒక్కసారి ఆ బేధాన్ని వదిలి చూడు లోకమంతా నీదే అనుబంధాలన్నీ నీవే బంధాలు ముడివడితే ఎంత మధురమో నీకే అర్థమవుతుందిలే * సెల్! చేతిలో సెల్ ఉంటే ప్రపంచం అంతా గుప్పిట్లోనే గుప్పెడంత గుండె మాత్రం మనసులకు మనుషులకు దూరం ప్రక్కవారితో మాట్లాడటానికి అయిష్టం ఎప్పుడూ సెల్ తో ముడి వేసుకుందామనే తాపత్రయం జాగ్రత్తోయ్! జాగ్రత్త! మనిషిగా మసలటం తెలుసుకో మనిషితనాన్ని నిలుపుకో ! * మంచిని ప్రశంసించాలి మాది వెంకట సాయి గ్రీన్ సిటీ.140 ప్లాట్స్ ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీ.సాయంత్రం పూట కొందరం కలుస్తూ ఉంటాము. అందులో ఒకరు వాళ్ళ మనవడు స్కూలు దగ్గరికి ఇల్లు మారుతున్నారు. వాళ్ళ ఇంట్లో మరువం మొక్క ఉందని తెలిసి తెచ్చుకోవడానికి వెళ్లాను. నాకు మల్లెలు, కనకాంబరాలు, మరువం కలిపిన కదంబ మాల అంటే ఎంతో ఇష్టం. అలా వెళ్ళినప్పుడు ఆవిడ మెడలో మెడలో వేసుకున్న దండ నాకెంతో నచ్చింది. మామూలుగా అయితే అంత తొందరగా నాకేమీ నచ్చవు. ఆ మాట అంటే వెంటనే ఆవిడ మెడలోంచి అది తీసి నాకు ఇచ్చేయబోయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మనకు చాలా నచ్చితేనే కదా ఏదైనా కొనుక్కుంటాం. అలాంటిది ఒక్కసారి అలా ఇచ్చేయాలనుకోవడం, ఇవ్వటం కష్టమే. నేనైతే అలా ఇవ్వలేను. అది ఎంత ఎక్కువ వెలదైనా ఎంత తక్కువ ఖరీదుదైనా. ఆ విషయం గుర్తుపెట్టుకొని మళ్లీ అలాంటి దండ కనిపించినప్పుడు కొని తెచ్చి ఇస్తాను. ఇలాగే మరొక స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో ఏదో బాగుంది అన్నానని వెంటనే అలాంటిది వాళ్ళ అమ్మాయిని షాపుకు పంపి తెప్పించేసింది. అరే బాగుందంటే ఇలా చేస్తావా అని నేను కోప్పడ్డాను. నువ్వు బాగున్నావు అంటే నాతో వచ్చేస్తావా అని చమత్కరించాను. ఇలా కొందరే చేయగలరు. మరి ఎదుటివారిలో ఉన్న మంచిని ప్రశంసించాలి కదా! అందుకే ఈ ప్రయత్నం. * నేను నడిచిన నేల పుట్టిన ఊరంటే మమకారం ఇక మన దేశమంటే ప్రాణం ఎందుకోయ్ నీ కంత ఇష్టమంటే చెప్పలేనోయ్ అక్షరాలు చాలవులే అమ్మ ప్రేమను కొలవగలమా? ఇదీ అంతే గుండె నిండా ఆరాధన మనసులో విశ్వాసపు తడి కళ్ళలో ఆర్ద్రత కలగలిపితే నా దేశం దేశ సేవలోనే ఊపిరి వదలాలని నా ఆశ సైనికునిలా తుది శ్వాస వరకు పోరాడుతా తల్లి రుణం తీర్చుకునే బిడ్డలా ఇంత కంటే నాకేంకావాలి? ఎవరు ఏమిచ్చారన్నది నాకొద్దు నేనెంత ఇస్తున్నానన్నదే ముద్దు * అర్థంలో పరమార్థం పక్కవాడు పడిపోతే లేపాలని ఒకరు చెప్పాలా? చూస్తూ పట్టనట్లు పోతే నువ్వూ మనిషివేనా? సందేహం రావాలి మరి ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకోక తప్పదు లోకమంతా ఇంతే నిన్ను నువ్వు అలా సమర్ధించుకోకు గొర్రెల మందలో గొర్రెవైతే గొప్పేముంది! కాపరివైనా కావాలి సహాయకారిగానైనా మిగలాలి అప్పుడే కదా జీవితానికో అర్థం! * కథ తరగని సిరి రోజులాగే ఆ రోజు నా షాపు తెరవటానికి వెళ్ళాను.షట్టరు బలవంతంగా తెరిచినట్లు ఉండటంతో షావులో దొంగలు పడ్డారని అర్థమై మనసు దిగులుగా మారిపోయింది. కారణం నా ఖజానా ఏమయిందోనని. షట్టరు తీసేలోపు ఎన్ని అలోచనలో! జీవితంలో ఏదీ కోల్పోయినా నేనంత బాధపడను. అవి పోతే మాత్రం నా ఆనందాన్ని నా సంతోషాన్ని దేవుడు ఒక్కసారిగా దూరం చేసినట్లే!నా ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే వాటిని దొంగలు దోచుకొని పోలేదు కదా అని కలవర పడుతున్న మనసును అదిమిపెట్టి భయపడుతూ షట్టర్ ఎత్తి లోపలికి వెళ్లాను.గదంతా చిందరవందరగా పడి ఉన్న కాగితాలను ఏరుకుంటూ టేబుల్ సొరుగు దగ్గరికి వెళ్ళాను. అందులో మిగిలినవి కూడా భద్రంగా ఉన్నాయి. ఎంత సంతోషమేసిందో నా గుప్తనిధిని నాకు వదిలినందుకు.దొంగలు ఎంత మంచివారో అని పించింది ఆ క్షణం. చిన్ననాటి నేస్తం' సిరి' రాసిన ఉత్తరాలు రంగు రంగుల్లో ఇంద్రధనస్సులా నా చేతుల్లో. సంతోషంతో నా కళ్ళు ఆనందభాష్పాలను రాల్చాయి ఏదో లంకెల బిందెలు నాకు దొరికినట్లుగా. మరి ధనం కంటే విలువైనవి ఆ ఉత్తరాలే నా దృష్టిలో! సమాప్తం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి