29, ఏప్రిల్ 2021, గురువారం

దేశ భక్తి..కధ

 

                                  దేశభక్తి 



                                                            చార్మినార్ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే  ఇన్నాళ్ళ తన కల నెరవేరినట్లే అనిపించింది.  ఎంత అరుదైన అపురూపమైన కట్టడం? ఎప్పటినుంచో దాన్ని తనివితీరా చూడాలని ఉబలాటం . చదువులకు ఫారిన్ వెళ్ళిపోవటంతో ఇప్పటికి ఈ  నేలను ముద్దాడే అవకాశం దొరికింది . అమ్మ ఒడిలో ఓలలాడినట్లే ఉంది . ఎప్పుడూ నెట్ లో చూసి ఆనందించటమే. పుట్టటం పెరిగింది అంతా విదేశాలలోనే . ఈ ముచ్చట తీర్చుకోవటానికి పాతిక సంవత్సరాలు పట్టింది . 
                   ఇక్కడంతా ఎంతో సందడి గా ఉంది . ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండే ఈ స్థలం ఇప్పుడు ఇసుక వేస్తే రాలనంత జనసమూహంతో కిటకిటలాడుతోంది . ఈ మధ్యే ఎక్కడో చదివింది ఈ విషయం. ఎంత మంది ఉన్నా ఎవరూ లేనట్లే తన ఆలోచనల్లో తను ఉండటం తనకే విచిత్రంగా ఉంది . 
                    రేపు సాలార్జంగ్ మ్యూజియం కి వెళ్ళాలి. ఒక రోజంతా చూసినా తనివితీరదట. పన్నెండు గంటలకు గడియారంలో బెల్ కొట్టటం అసలు మిస్ అవ్వకూడదని అమ్మ మరీ మరీ చెప్పింది. అలాగే బిర్లా మందిర్ కూడా. రాత్రిపూట వెన్నెల్లో  ఎలా మెరిసిపోతుందో .. ఎంత చూసినా ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నిజంగా చూసినప్పుడు ఇంకెంత బాగుంటుందో !ఏదీ వదలకూడదు. ఇక్కడ ఉన్నవి అన్నీ చూసెయ్యాలి.         
   ''ఈ రోజు ఇది ఉంది . రేపు ఇక్కడ ఏమీ కనిపించదు'' గుసగుసగా వినిపిస్తున్న ఆ మాటలకు అదిరిపడింది అపర్ణ . 
 వీళ్ళు దేని గురించి మాట్లాడుకొంటున్నారు ?సందేహం రావటంతో ఇక వాళ్ళను, వారి మాటలను శ్రద్ధ గా వినటం ప్రారంభించింది . 
      వాళ్ళకు అనుమానం రాకుండా వాళ్ళను అనుసరించటం మొదలు పెట్టింది . ఇదేదో చాటుమాటు వ్యవహారం లానే ఉంది . 
''హుష్! పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటివి మాట్లాడొద్దని ఎన్ని సార్లు చెప్పాను? వినవు కదా'' విస్సుక్కుం టున్నాడు ఇద్దరిలో ఒకతను . 
       ఇక నా అనుమానం రూడి అయిపోయింది . నా  సందర్శనలను ప్రక్కన పెట్టి వీళ్ళ వెంటపడటమే పనిగా పెట్టుకోవాలని ఆ నిముషానే మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను . మన సంపదను మనమే కాపాడుకోవాలిగా!
       కాసేపు వాళ్ళు మౌనం పాటించారు . 
అది తుఫాను ముందు ప్రశాంతతలా తన మనసును కలవరపరుస్తోంది .  
      వాళ్ళను అనుసరిస్తోందే కానీ మనసు మనసులో లేదు.అంటే వీళ్ళు చార్మినార్ని కూల్చేద్దామనా అనుకునేది .. అది తలచుకుంటుం టేనే గుండె గుభేల్ మంటోంది.ఒళ్ళు గగుర్పు పుడుతోంది. తన గుండె చప్పుడు తనకే భయంకరంగా వినిపిస్తోంది.  
       వాళ్ళు నడక వేగాన్ని పెంచడంతో తన నడకను కూడా స్పీడు పెంచింది. 
తను ఇలా చెయ్యటం తప్పో ఒప్పో తెలియటం లేదు. మనసు చెప్పినట్లు ప్రయాణిస్తోంది. అంతే!    
       సందులు గొందులు తిరిగి ఒకింట్లోకి వారు ప్రవేశించటం చూసాక కానీ ఆమె మనసు శాంతించ లేదు . అప్పటి దాకా వాళ్ళు తనని గమనిస్తారేమో నని దూరం దూరంగా నడిచింది.ఇప్పుడు కాస్త ఉపిరి తీసుకునే సమయం దొరికినట్లయింది. 
      దగ్గరలో ఉన్న టీ కొట్టుకి వెళ్లి కూర్చుంది.అలవాటు ప్రకారం సర్వర్ టీ తెచ్చి ఇచ్చేసాడు. వేడి టీ గొంతులోకి  దిగాక కానీ తన లోపల ఉన్న వణుకు తగ్గలేదు. ఇంకా కాళ్లు వణుకుతూనే ఉన్నాయి. టీ త్రాగుతూ చుట్టుప్రక్కల వాతావరణాన్ని గమనించసాగింది. బిజీ సెంటరే. కానీ ఎవరితో ఎవరికీ సంబంధం లేనట్లు ఎవరి పనుల్లో వారున్నారు. ఇప్పుడు జనాలకు డబ్బు సంపాదించుకోవటం తప్ప ప్రక్క వాళ్ళతో మాట్లాడాలనే ధ్యాసే ఉండటం లేదు. అలా ఉన్నారు మనుషులు. పోనీలే అదే మంచిది.అందువలనేగా ఇప్పటి వరకు తనని ఎవరూ పట్టించుకోలేదు.    
      కాస్త సమయం గడవటం వలన ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా అనిపించసాగింది. అయినా గుండెల్లో గుబులుగానే ఉంది.తను అనుసరించింది మాములు వ్యక్తులతో కాదు.ఆత్మాహుతి దాడిలో తమను తాము బలిచేసుకుంటూ వందలు వేల మంది ప్రాణాలతో చెలగాటమాడే ఉగ్రవాదులతో తను తలపడబోతోంది.
       'అప్పుడే అంత ఊహించేసుకుంటావ్ ఎందుకని?' మనసు మందలించింది. తన కెందుకో పూర్తి నమ్మకంగా ఉంది వాళ్ళలాంటి వాళ్ళేనని. వాళ్ళకి దగ్గరలో తనకొక ఇల్లు దొరికితే బాగుంటుంది.  ఈ విషయాన్ని తను అంత తేలికగా తీసుకోదలచుకోలేదు.ఒకవేళ తనది ఊహే అయితే అంత కంటే ఆనందం ఏముంటుంది? అప్పుడే ఈ విషయాన్ని సంతోషంగా మరిచిపోతుంది. ఇప్పుడు ఎవరినీ వాళ్ళ గురించి అడగలేదు. ఏ మాత్రం తన మీద అనుమానం వచ్చినా అసలుకే మోసం వస్తుంది. హ్యాండ్ బాగ్ లోంచి టీ కి డబ్బులు తీసిచ్చింది.అప్పటికే వాళ్ళంతా ఎవరీ కొత్త అమ్మాయి అని చూపులతో సైగలు చేసుకోవటం గమనిస్తూనే ఉంది. ఆడపిల్ల అందులో అందమైనది .. ఆ మాత్రం  టీ కొట్టులో పని చేసే వాళ్ళు పట్టించుకోవటం లో తప్పు లేదు. ముందు ముందు వీళ్ళతో తనకు పని పడినా పడవచ్చు. అయినా తనేమిటి ఏదో పెద్ద డిటెక్టివ్ లా ఆలోచించేస్తోంది. తన ఆలోచనలకు తనకే నవ్వు వస్తోంది. ఇంత హడావిడి లో కూడా. 
    ఇక  వాళ్ళ ఆలోచనలకు తెరదింపెయ్యాలి అనుకుని నవ్వుతూ వారి వైపు చూస్తూ ''దగ్గరలో ఏమైనా ఇల్లు దొరుకుతుందా?'' అని అడిగింది. 
       ''అదుగో ఆ పచ్చ బిల్డింగ్ ప్రక్క ఇల్లు ఖాళీనే. వెళ్లి కనుక్కోండి'' అన్నాడు టీ కొట్టు యజమాని. 
జీవితంలో అంత ఆనందం ఎప్పుడూ పడలేదు. అంత సంతోషం ఎందుకంటే ఇందాక వాళ్ళు లోపలికి వెళ్ళిన ఇంటి ప్రక్క ఇల్లే ఇది. ఇంకేముంది ఉత్సాహంగా కాళ్ళు కదిలాయి. అక్కడకు వెళ్లి మాట్లాడింది. వాళ్ళు పెట్టిన షరతులు అన్నిటికీ తన అంగీకారాన్నితెలిపి అడ్వాన్సు ఇచ్చి ఇప్పుడే చేరిపోతానని చెప్పేసింది. తాళం కొనుక్కుని తెచ్చుకునే వరకూ మీవి వాడుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళింది. వాళ్ళ కిటికీ తన కిటికీ ఎదురెదురుగా ఉంది.భలే బాగుందే అని అనుకునేలోపే వాళ్ళు వచ్చి కిటికీ తలుపులు వేసేసారు. కాస్త గమనించే సమయం కూడా ఇవ్వలేదు. ఇన్నాళ్ళూ ఎవరూ లేరని తీసి ఉంచారన్నమాట. అయితే తను ఉహించినదే నిజమన్నమాట. ఇక ఇప్పటికి చేసేదేమీలేదని నిశ్చయించుకుని బయట పడింది. 
          ఆ తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ గురించి,అక్కడ యస్ ఐ ఎలాంటివాడో కూడా ఎంక్వయిరీ చేసింది. ఈ మధ్య స్మగ్లర్లకు సహాయం చేసే పోలీసులు ఎక్కువై పోతున్నారు.అలాంటివారికి ఇన్ఫర్మేషన్ అందించటమంటే దొంగ చేతికి తాళాలు అందించినట్లే కదా! ఆమె ఎంక్వయిరీ లో అతను సిన్సియర్ అని తెలిసాక 'హమ్మయ్య !'అనుకుంది. లేదంటే ఏ ఆధారం లేకుండా ఏమిటిదని తనని ఇంటరాగేట్ చేస్తే తెలిసి తెలిసి చిక్కుల్లో పడినట్లు అవుతుందని ముందు జాగ్రత్త పడింది. అప్పుడు ఆయన్ని కలిసి ప్రొద్దున తను వచ్చిన దగ్గర నుంచీ జరిగినదంతా పూసగ్రుచ్చినట్లు చెప్పింది. మీకు చెబితే ప్రయోజనం ఉంటుందని చెప్పటానికి వచ్చాను.''  
          ''భలేవారే. ఇది మాకు మంచి ఇన్ఫర్మేషన్. ఇంతకు ముందే మాకు ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెతుకుతున్నాం కానీ ఏమీ జాడ తెలియటం లేదు . సరైన సమయంలో మీ సహాయం అందింది. అందుకు మీకే నేను థాంక్స్ చెప్పాలి'' 
   ''నేను అనుకున్నది కరెక్టో కాదో తెలియకుండా ఎలా నిర్ధారించుకోగలం సర్?'' అని అడగటంతో ఆతను నవ్వేస్తూ ''ఇప్పుడు మనకంత టైం లేదు మేడం,తీరిగ్గా అవన్నీ తర్వాత చర్చించుకుందాం.ముందు ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియాలి. ఆ పనిలో పడాలి" అంటూనే ఎవరికో ఫోన్ చేశాడు. 
     వెంటనే ఓ కుర్రోడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. 
 ''ఏమిటి సర్,పని పడిందా?'' అని అడిగాడు. 
''అవునురా. చాలా అర్జెంట్.''                                        
''చెప్పండి సార్,అల్లుకుపోతాను.''    
 బాబా టీ కొట్టు దగ్గరకు వెళ్లి అక్కడ పని లో చేరిపో. చొక్కానే చిం పేసుకుంటావో,ఏడుపు ముఖం పెడతావో నాకు తెలియదు. ఆ పచ్చ బిల్డింగ్ లో వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో,ఏంచేస్తున్నారో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. అలాగే వాళ్ళు బయటికి వెళుతుంటే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చెయ్యాలి. మిగతాది వాళ్ళు చూసుకుంటారు.''
''అలాగేనండీ''అంటూ ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. 
''ఇక కంగారుపడవల్సింది ఏమీ లేదు అపర్ణ గారూ'' అన్నాడు రిలాక్స్ అవుతూ కృష్ణ కిరణ్. 
''అంతా సవ్యంగా జరుగుతుందంటారా?''అనుమానంగా అడిగిన ఆమెతో 
''క్లూ దొరకటం వరకే కష్టం. అది తెలిసిందంటే పనులు వాటంతటవే జరిగిపోతాయి. మనకు మంచి నెట్ వర్క్ ఉంది . దానిని ఉపయోగించుకుంటే చాలు.''అన్నాడు ధీమాగా. 
"అలా అయితే మంచిదే సార్ "అంది తృప్తిగా. 
"అయినా ఈ మధ్య బెదిరింపులు ఎక్కువై పోయాయి. ఏదో వాళ్ళ అత్తగారి సొమ్ములా అన్నట్లు తిరుపతి కొండ మీద బాంబు వేస్తాం. భద్రాచలం రాముడి గుడి లేపేస్తాం అంటూ. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా ఏమిటి?వాళ్ళ ఉద్దేశం ఏమిటో అర్ధం కాదు. అసలు కట్టడం ఎంత కష్టం?ఎంత డబ్బు,ఎంత మంది కూలీలు,ఎందరు శిల్పులు తమ శ్రమను ధారపోస్తే ఇవన్నీ మన కళ్ళముందు నిలబడ్డాయో ఎవరికీ అక్కరలేదు."
         అతని మాటల్లో ఎంతో వేదన.. గొంతులో స్పష్టంగా ధ్వనిస్తోంది. 
"మీరు ఇక వెళ్లిపోవచ్చు."
''వద్దు లేండి  సార్. మళ్ళీ ఏ అవసరమైనా పడచ్చు. ఇక్కడే ఉంటాను. "
''ఓ పౌరురాలిగా అలా ఆమె అంత భాద్యతగా వ్యవహరిస్తుంటే అతనికి ఎంతో ముచ్చటగా ఉంది. అందరూ అలా ప్రవర్తిస్తే దేశంలో ఇన్ని నేరాలే జరగవు'' అనుకున్నాడు మనసులో. 
        ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది. 
"వాళ్ళు బయటికి వచ్చారు సర్. ఫాలో అవుతున్నాం. ఓవర్"
        అవతల ఫోన్ కట్టయ్యింది. 
"ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది మిస్ అపర్ణా!వాళ్ళు బయటకు వచ్చారు.వాళ్ళ వద్ద ఏ చిన్న ఆధారం దొరికినా వాళ్ళ పని మటాష్. "అన్నాడు పళ్ళు కొరుకుతూ. 
       "వీళ్ళకు ఇల్లు ఎలా ఇస్తారు సార్?" 
"వీళ్ళ దగ్గర లెక్కలేనన్ని ఆధార్ కార్డులు ఉంటున్నాయి.  ఎలా సంపాదిస్తున్నారో అర్ధం కావటం లేదు. మన యంత్రాంగం అంత వీకా అని కూడా అనిపిస్తూ ఉంటుంది."
"ఇప్పుడేం చేస్తారు?నాకంతా టెన్షన్ గా ఉంది."
"రిలాక్స్ అపర్ణా!వాళ్ళ ఫోన్ టాప్ చేశారు మా వాళ్ళు. ఈ విషయం గురించి ఒక్కమాట మాట్లాడినా చాలు. వాళ్ళ పని అయిపొయినట్లే"
       మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది.
"వాళ్ళు ఒక్కచోట కాదు. మన రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకేసారి బాంబులు పేలేటట్లు ప్లాన్ చేసారు. అందులో మన బిర్లామందిర్,ట్యాంక్ బండ్,బాసర,భద్రాచలం గుడిలు .. ఇంకా చాలా ఉన్నాయి. ఇక మనం ప్రొసీడ్ అవటమే! మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం"
      "ఓ.కే. ప్రొసీడ్. కానీ వాళ్లకు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. వాళ్ళు రూమ్ కి రాగానే  నాకు ఫోన్ చెయ్యండి. పబ్లిక్ లో పట్టుకుంటే వాళ్ళ వాళ్ళు మన మీద అటాక్ చెయ్యవచ్చు. మీ కాల్ రాగానే నేనూ, మన సిబ్బంది అక్కడకు వచ్చేస్తాం "
"అపర్ణా!పదండి. మనం మీ రూమ్ కి వెళ్లి అక్కడ వెయిట్ చేద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యటానికి వీళ్ళేదు. "అంటూనే లోపలికి వెళ్లి నిముషంలో బయటికి వచ్చాడు ముస్లిం వేషంలో. 
    ''పదండి'' అని అతను అనే వరకూ ఆమె గుర్తుపట్టలేదు అతనే కృష్ణ కిరణ్ అని. 
ఆటోలో బయలుదేరారు. 
    ''వాళ్ళకు గానీ,వాళ్ళ వాళ్లకి కానీ ఏ మాత్రం అనుమానం వచ్చినా మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది కదండీ.అలాంటప్పుడు మనం రూమ్ దగ్గరకు వెళ్ళటం కూడా మంచిది కాదేమో " 
     "అబ్బో!కాసేపు ఉన్నావో లేదో అప్పుడే నీకు మా బుద్దులు అబ్బేసాయి. " అని నవ్వేస్తూ "మనం ఆ సందు దగ్గరే ఉంటాం కానీ అక్కడకు వెళ్ళం" అన్నాడు. 
     టీ కొట్టు బాబ్జీ కి ఫోన్ చేసాడు "వాళ్ళు రాగానే ఎప్పుడూ మీరు పంపే అబ్బాయితోనే టీ పంపండి. కాకపొతే మా వాడు ఇచ్చే మత్తు మందు అందులో కలపండి." 
     ''అలాగే సర్ "అన్నాడు ఉత్సాహంగా. 
తనూ ఈ ఆపరేషన్ లో భాగమవుతున్నానన్న ఆనందం అతని మాటల్లో కనిపిస్తోంది. 
      అంతా అనుకున్న ప్రకారమే జరిగింది. 
కాసేపటి తర్వాత వెళ్లి తలుపులు బ్రద్దలు కొట్టి వాళ్ళిద్దరిని కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్ళతో చేతుల్ని,కాళ్ళని కట్టేశారు. ఆ తర్వాత నీళ్ళు జల్లి మత్తు విడకొట్టారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా పెదిమ విప్పితే ఒట్టు. 
వాళ్ళ దార్లు వాళ్లకు ఉంటే మన దార్లు మనకి ఉంటాయి. 
    వాళ్ళ సెల్ లోంచి వాళ్ళు మాట్లాడినట్లే మాట్లాడటంతో గుట్టు రట్టు అయ్యింది. మిమిక్రి అలా ఉపయోగపడింది. కధ సుఖాంతమయ్యింది.నిజంగానే అన్నంత పని చేసి చూపించాడు కృష్ణ కిరణ్.   
     మొత్తం ముఠా అంతటిని ఆరు గంటల్లో పట్టేసాడు. 
రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచీ కాపాడాడు. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ ముఠా సభ్యులు అందరూ బయటకు వచ్చారు ఈ దెబ్బతో తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు.   
     అప్పటిదాకా వెళ్లిపొమ్మన్నా వెళ్లనని అక్కడే ఆ రూమ్ లోనే ఉంది అపర్ణ . 
ఆమె దేశభక్తికి అచ్చెరువొందాడు కృష్ణ కిరణ్.  
     టీ వీ లు అన్నీ అపర్ణను ఆకాశానికి ఎత్తేసాయి. ఇదంతా ఆమె చొరవ వల్లే జరిగిందని అందరూ కొనియాడారు.  
ముఖ్యమంత్రి'శ్రీ గుణశేఖర రావు' ప్రత్యేకంగా ఆమెను పిలిచి సన్మానించారు. 
  ''మీకు ఆ సమయం లో భయం వేయలేదా?''అన్న విలేఖర్ల ప్రశ్న కు మన చార్మీనార్ ని కాపాడుకోవటానికి నా ప్రాణం పోయినా పర్వాలేదనుకునే నేను ఈ  రంగంలోకి దిగాను''అని చెప్పటం తో అక్కడ అంతా చప్పట్లు మారుమ్రోగాయి.
                         దీనితో ప్రతి వ్యక్తీ దేశం పట్ల భాద్యతతో వ్యవహరించాలని అందరికీ భోధపడింది.   
       
                                                                       సమాప్తం 
                                                                              
                                                                             *                                                                            
                                                                      హమీ పత్రం 

        ఇందులో నేను పంపుతున్న కధ "దేశభక్తి "  నా స్వంత రచనయే నని ,కాపీ ,అనువాదం ,అనుసరణ కాదని ,ఏ బ్లాగ్ లోనూ ,ప్రసారం ,ప్రచురణ కాలేదని హామీ ఇస్తున్నాను . 
 
                                                                         యలమర్తి అనూరాధ 
                                                                          Bank colony,
                                                                             quarter no-13
                                                                              Tanuku-534211            
                                                                           cell-9247260206








                                                                 

                                                                
                                                                  
                                                              
                                                                  
                                                                  
                                                                 
                                                        

26, ఏప్రిల్ 2021, సోమవారం