26, జులై 2021, సోమవారం

వలస బ్రతుకులు

. BJYM ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి కధల పోటీలో సెలెక్ట్ కాబడి సంకలనం లో చోటు చేసుకున్న నా కథ వలస బ్రతుకులు నిప్పులు చెరుగుతున్న ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఓ జంట. నెత్తిపై ఓ మూట,చంకలో ఓ మూటతో ప్రయాణం.కరోనా ఉన్నట్టుండి రేపిన కలకలం తో ఉపాధి కోల్పోయారు. కూలి పని లేకపోవడంతో సొంత ఊరికి ప్రయాణం అయ్యారు బాందియా,జితిన్ కృష్ణన్. ఏ తోడూలేనివారికి నీ నీడే తోడు అన్నట్లు ఉంది వారి పరిస్థితి.ఆమె నిండు గర్భిణి. రైల్లోప్రయాణం చేయాలనుకుంటే సీటు దొరకలేదు. లారీల్లో వెళ్ళటానికి మనిషికి రెండు వేల పైన అడుగుతున్నారు. ఇద్దరికీ అంటే అయిదు వేల రూపాయలు.ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే చేసేది ఏమీ లేక కాలి నడకన ప్రయాణమయ్యారు.వీళ్ళు వెళ్లాల్సింది వంద కిలోమీటర్లే.మరెందరో వలస కార్మికులు వేల కిలోమీటర్లు ఇలా కాలినడకన నడుస్తున్న వార్తలు చాలామంది హృదయాలను ద్రవింపచేస్తున్నాయి. " మామా! అలసటగా ఉంది. కాసేపు ఎక్కడైనా కూర్చుందామా?" అడిగింది ఆమె. " అలాగే ! కానీ ఎక్కడ?ఒక చెట్టనేదే లేదు. ఇళ్ళూ లేవు. అరుగులూ లేవు. నాగు పాములా సర సర ప్రాకుతున్న రోడ్డు తప్ప . పోనీ దాని మీదే కూర్చుందాం అంటే భగ భగ మండిపోతుంది .అయినా తప్పదు."అని గుడ్డల మూట లోంచి ఉన్న రెండు చీరలను తీసి మడత పెట్టి రోడ్డు మీదే వేసి వాటి మీద భార్యను కూర్చోబెట్టాడు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోక ఇలా తనతో పాటు ఇంత అవస్థ పడుతున్న ఆమెను చూస్తుంటే కన్నీళ్లు ఆగటంలేదు అతనికి. బాందియా మాత్రం దానిని కష్టంగా భావించటం లేదు. తన బరువు కాకుండా బిడ్డ బరువును మోస్తున్నానన్న బాథాలేదు. ఇంకా అది ఆమెకు ఆనందాన్నిస్తోంది. ఆ ఇష్టమే ఈ బాధను తగ్గిస్తోంది. తొలిబిడ్డ .అందుకే అంత మమకారం. కాసేపు కూర్చున్నాక దొరికిన చోట పట్టుకున్న మంచినీళ్ల సీసా తో పసిపిల్లకు పాలు పట్టించిన్నట్లు పట్టించాడు కృష్ణన్ బాందియాకు. " మామా!"అంది ఆమె కళ్ళలో ప్రేమ నింపుకుంటూ. "కాసినే తాగు.మళ్లీ దారిలో ఆహారం పొట్లాలు దొరక్కపోతే ఇవే గతి అవుతాయి.బరువని వదిలేస్తే ఈ దాహానికే ప్రాణాలు బలి అయిపోతాయేమో?" "ఏమో! మామా! కడ దాకా వెళతామా? ఊరు చేరుతామంటావా?" దిగులుగా అడిగింది. "అధైర్య పడమాకు.చేరక ఎక్కడికి పోతాము.నీకు తోడు నేనున్నాగా. మనకు తోడు మన బిడ్డ .ఏమంటావ్?" నుదిటి మీద నుంచి కారుతున్న చెమటతో కన్నీళ్లు కలిసి జారిపోతుంటే ఓ శుష్కమైన నవ్వు కనిపించి మాయమయ్యింది వారిద్దరి పెదాలపైన. ఊరి చివరలో ఉన్నారు. ఇంతలో ఓ అమ్మ వచ్చి ఇద్దరికీ చెప్పులు ఇచ్చి వెళ్ళింది. అలా ఆమె అందరికీ చెప్పులు పంచుతోంది . ఏదో ఆమెకు తోచిన సాయం. ఎందరో ధనవంతులు ఏసీ రూముల్లో హాయిగా నిద్రపోతుంటే తాము మాత్రం ఇలా ఎండనక వాననక ప్రయాణిస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కాపాడినా చాలే అన్న ఆలోచన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్లంతా. ఎప్పుడు మారతారో ఈ జనం? వంద కిలోమీటర్ల గమ్యాన్ని ఎలా చేరతమా అన్న మాట తప్ప మరో ధ్యాస లేదు వారికి. వారం రోజుల నుంచీ ఇలా నడుస్తూనే ఉన్నారు.లూథియానా నుంచీ బీహార్ లోని తమ సొంత గ్రామం కి ఎప్పుడు చేరుకుంటామా అనే తహ తహ. తమ చుట్టూ ఎందరో వృద్ధులు, మరెందరో పిల్లలు. జనమంతా గుంపులు గుంపులుగా.అందరిదీ ఒకే ఆశ. ఎలాగైనా తమ ఊరు చేరాలని. ప్రభుత్వం వారు పంపేదాకా ఆగలేకపోతున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక ఈ సాహసానికి ఒడిగడుతున్నారు.ఆ సంఖ్య లక్షల మీద ఉంది మరి. ఉన్నట్టుండి బాందియాకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దరిదాపుల్లో ఎక్కడా ఇల్లనేదే లేదు .సూర్యుని ప్రతాపం తప్ప. ఆ నిండు చూలాలు పడుతున్న బాధను చూడలేక తలలు తిప్పుకుంటున్నారు అంతా. చివరకు ఆ రోడ్డుమీదే ప్రసవం జరిగిపోయింది ఆమెకు. విషాదం విషాదాన్నే వెతుక్కున్నట్లు పుట్టిన బిడ్డ మరణించింది. అప్పటిదాకా గాలికి రెపరెపమంటున్న ఆశ చచ్చిపోయింది . వారిద్దరి రోదనలతో నింగీ నేలా ఏకమయ్యాయి. మామను పట్టుకుని ఏడుస్తున్న బాందియా ఏడుపును ఎవరూ ఆపలేకపోయారు. రెండు గంటలు ఆగి మళ్లీ ప్రయాణమయ్యారు . తమది కాకుండా పోయిన ఆ బిడ్డను ఖననం చేసిన బాధ బరువును కూడా మోస్తూ .కొంత దూరం నడిచాక డ్యూటీలో ఉన్న పోలీసులు వాళ్ళను అలా చూసి చాలా బాధ పడ్డారు . వారిద్దరికీ కాళ్ల నిండా పుళ్ళు. " మీరు ఆగండి .ఏదోలా మిమ్మల్ని మీ ఊరు చేరుస్తాం." అని చెప్పారు. "వీళ్ళ మాటల్లో ఎంత నిజం ఉంది "అని ప్రశ్నిస్తున్నట్లు ఉన్నాయి వారి గాజు కళ్ళు. కరోనా అన్న చిన్న మూగజీవి.ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేసేస్తోంది.అతాకుతలమయి పోతున్నాయి ఎందరో జీవనాలు. ఉద్యోగాలు పోయి జీతాలు లేక ఎందరో కూలీలు పొట్ట చేత పట్టుకొని ఇలా సాగిపోతున్నారు. ఈ రోజు తింటే అయిపోయే బతుకులు .రేపటి కోసం దాచుకోవటానికి ఏముంటుంది? దాచుకోవాలి.రోజుకో రూపాయి దాచుకున్నా ఈ కష్ట కాలంలో ఎంతో ఆదుకునేది.పొదుపు ఇచ్చే సుఖం ఇప్పుడు ఎందరికో అర్ధం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అటుగా వెళ్తున్న లారీని ఆపి వాళ్ళిద్దర్నీ దగ్గరుండి ఎక్కించారు పోలీసులు . వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా చేతులు కలిపి దండం పెట్టారు వాళ్లిద్దరూ. చివరకు తమ ఊరి పొలిమేర కనిపించటంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది వారికి. ఎక్కడో విదేశాలకు వెళ్లి స్వదేశానికి వచ్చి మన మట్టిని తాకిన అనుభూతి. అంత సంతోషంలోనూ బిడ్డను పోగొట్టుకున్న బాధ. వారిని ఓదార్చటానికి అన్నట్లు చినుకులు చిన్న చిన్నగా రాలటం ప్రారంభించి వానగా మారి వారి హృదయాలను తడిపేసింది. వాళ్లే ఎదురుతిరిగితే పరిస్థితి ఏమిటి? ఆ రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. సమాప్తం