20, మే 2016, శుక్రవారం

నా కధ 'తిరిగి వచ్చిన వసంతం '

నా కధ 'తిరిగి వచ్చిన వసంతం ' అక్షర ఇ మాగజైన్ లో ..



కథలు »
  
 
పక్షుల కిలకిలారావాలు పలకరింపుతో మెలుకువ వచ్చింది. ఈ యాంత్రిక జీవనంలో తనను ఓదార్చే నేస్తాలు అవే.
    మాట్లాడకపోయినా తన మనసుకు ఎంతో స్వాంతన చేకూరుస్తాయి.
    మరి మేమూ అంటున్నాయి పెరట్లో పూలు. నందివర్ధనాలు, గన్నేరు, పచ్చ పూలు మూకుమ్మడిగా! ఉన్నారురా.
    నా కళ్ళకు ఆహ్లాదాన్ని పంచేదే మీరు అలాంటి మిమ్మల్ని ఎలా మరిచిపోతాను? నా పిల్లల కంటే మీరే నాకిష్టం ఇంకా చెప్పాలంటే!
    ఆమె మాటలు విని అవి సంతోషంగా తలలు ఆడించాయి. ఇంతలో చల్లని పిల్లతెమ్మెర వచ్చి పలకరించి వెళ్ళింది.
     ఎంత హాయిగా అనిపించిందో? ఆ లాలన తన భర్త నుంచీ లభిస్తే ఎంత బాగుంటుంది? ఈ జన్మలో ఆ కోరిక నెరవేరదేమో?
     ఈ రోజు ఉగాది ఎంత హడావిడిగా ఉండాలి? ఏమీ లేదు. అర్థరాత్రి  దాకా టీ.వీ.లు   చూసి పడుకున్నారు.  లేపినా లేవరు.
     తన పనులు ఆగిపోతాయి తప్ప.  అందరూ లెస్తేనే కదా పండుగ సందడి! మనసాగక వెళ్ళి "గీతా! లేమ్మా! తెల్లారిపోయింది." అంది సౌభాగ్య.
     "పోమ్మా!  ఇప్పుడే ఏం తొందర?" నసిగింది మరింత దుప్పటిలోకి ముడుచుకుపోతూ.
     "పండుగరా! ఈ రోజు కూడా లేవకపోతే ఎలా? నువ్వు లేచి తమ్ముళ్ళను కూడా లేపు."
      పడుకోనియ్యమ్మా! మా ఫ్రెండ్స్ ఎవరూ దీన్ని అసలు పట్టించుకోరు. లేచి నేనేంచేస్తాను?" సగం నిద్రలోంచే సమాధానమిచ్చింది మరో వైపు తిరిగి పడుకుంటూ.
     "చక్కగా అందరం కలసి గుడికి వెళ్దాం".
      తన అభ్యర్ధన దాని మనసుకు తాకలేదని అర్థమైంది---దాని మౌనంతో. ఇక లాభం లేదు ఒంటికాయ సొంఠి కొమ్ములా తను ఒక్కటే చేసుకోవాలి అనుకుంటూ....
      నిన్న ఎదురింటి అబ్బాయితో తెప్పించిన మామిడి కొమ్మలను పురికొసతో గుమ్మానికి కట్టింది.
      అందమైన అమ్మాయి మెడకి నెక్లెసు పెడితే ఎంత కళకళలాడుతుందో అలా గుమ్మం తోరణాలు కట్టగానే ఎంత అందాన్ని సంతరించుకుందో?
      బయట కళాబు చిమ్మి అందమైన ముగ్గు వేసింది. గబ గబా వెళ్ళి స్నానం చేసి వచ్చింది.
      కొత్తచీర కట్టుకుని బొట్టు పెట్టుకుంది. ఇంతలో ప్రక్కింట్లోంచి 'రమ్య '  పిలిచింది.
     "ఏంటిరా?"
"ఆంటీ! అందరం గుడికి వెళుతున్నాం, మీరూ వస్తానంటే తీసుకువెళ్దామని "
"వస్తాను. "ఆలోచించకుండా అంగీకారాన్ని తెలియజేసింది.
  "ఓ పది నిమిషాలలో బయలుదేరదాం"
       "అలాగే" అంటూనే అద్దం ముందుకెళ్ళి జడ వేసుకోవటం ప్రారంభించింది. తనకు తనే ముద్దు వచ్చేస్తోంది. అందుకే రమ్యకు తనంటే చాలా ఇష్టం, మీకు నేనున్నానాంటీ" అంటుంటుంది ఎప్పుడూ.
      అందుకే రాళ్ళలా తన ఆలోచనలను అర్థం చేసుకోలేని తన వాళ్ళ కంటే రమ్య తనకు దగ్గరగా అనిపిస్తుంది.
      "ఆంటీ! మీరు ముందుకు వచ్చెయ్యండి" అంది  డ్రైవింగ్  సీట్లో రమ్య కూర్చుంటూ.
      "నాన్నగారిని కూర్చోనివ్వమ్మా!" అంది మొహమాటపడుతూ.
      "ఫర్లేదు ఆంటీ, అమ్మ, నాన్న, తమ్ముడు వెనుక కూర్చుంటారు, మీరు వచ్చెయ్యండి అనటంతో వెళ్ళి కూర్చుంది.
కారు  ముందుకు వెళుతున్నా  తన ఆలోచనలు వెనక్కి వెళుతున్నాయి. అదే జనవరి ఫస్ట్ రోజున తమింట్లో ఎంత హడావిడి?
     తెల్లవారక ముందే లేచి కొత్త బట్టలు కట్టుకుని హాండ్ బ్యాగ్లో గ్రీటింగులు, చాక్లేట్లు పెట్టుకుని అందరూ అందరి ఇళ్ళకి  వెళ్ళి గ్రీటింగ్స్ ఇచ్చుకుని 'హాపీ న్యూ ఇయర్ ' చెప్పుకోవటమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు, అది మన పండుగ కాకపోయినా!
    కొత్త సంవత్సరాది. ఈ సంవత్సరం ప్రారంభం అంటే వినరు. దీన్ని అసలు పట్టించుకోరు.
    ఏమిటో! అందరూ విదేశీ సాంప్రదాయాలు వైపు మొగ్గు  చూపుతున్నారు. బట్ట వాళ్ళ లాగే కడుతున్నారు. అలవాట్లూ వాళ్ళవే!
    మనదైన సంస్కృతీ, సాంప్రదాయాలను వదులుకుంటున్నారు. ఎటువైపు వెళుతున్నాం మనమంతా?
    మంచి ఐతే నేర్చుకున్నా తప్పు లేదు.
    దీనివల్ల మనకు లాభాలు కంటే నష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.  విచ్చలవిడి తనం పెరిగిపోయింది. పెద్దలంటే గౌరవం తరిగిపోతోంది. విలువలు పడిపోతున్నాయి.
     ఎక్కడ చూసినా అత్యాచారాలూ, అరాచికాలు.
     స్త్రీలను ఆట బొమ్మలుగా ఆడుకుంటున్నారు.
     "ఆంటీ! ఏంటీ? మాట్లాడటం లేదు?" అన్న రమ్య మాటలకు ఈ లోకంలోకి వచ్చా!
     "ఏం లేదురా! ఈ లోకం తీరు గురించి ఆలోచిస్తున్నానంతే!
     "నచ్చట్లేదా? మార్చేద్దాం ఆంటీ!"

     "ఏంటి మార్చేది ?మా ఇంట్లో వాళ్ళను నేను మార్చలేకపోతున్నాను. ఇంకెవరిని   మార్చేది ?"
      "ఆంటీ! ఏదీ సాధ్యం కానిది లేదు మనం తలచుకుంటే.  చూసారా ఈ రోజు పేపర్లో ఏం రాసారో? మానవ మెదడును రోబో లోకి జొప్పిస్తారట. అలా మనిషికి చావు లేకుండా చేస్తారట. వాళ్ళు అంతలా సాధిస్తుంటే మనం ఈ చిన్న పని చెయ్యలేమా?" ఆమె మాటల్లో ఎంత ఆత్మవిశ్వాసమో!
"ఏమోరా! నాకు నమ్మకం లేదు . "
"లేదాంటీ! మళ్ళీ సంవత్సరం ఉగాదికి మీ కార్లో మీ కుటుంబంతో వెళ్తారు.
    నేను మాటిస్తున్నాను. అప్పుడు సంతోషమే కదా!
 "చాలా!".
 "మరైతే పథకం ఆలోచిస్తా. దేముని ఆశీస్సులు అందుకుని ప్రారంభిస్తా.
    మీ సహకారం అందిస్తే మీ కలను సాకారం చేస్తా" --అంటూనే గుడి రావటంతో బ్రేక్ వేసింది కారుకి.
    తనకు ప్రకృతిని గమనించటమంటే ఇష్టమని వాళ్ళ నాన్నగారినే వెనక కూర్చోపెట్టింది. రమ్య అనుకుంటే ఏదైనా సాధిస్తుంది అనుకుంది మనసులో.
    గుడిలో జేగంటలు మ్రోగాయి.అంటే తన కోరిక తీరుతుందన్నమాట. అందరూ కలిసి ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నారు.
    ప్రదక్షిణాలు చేస్తున్నవారిని  గమనించసాగింది.  పంతులుగారిచ్చిన ఉగాది పచ్చడి ఆస్వాదిస్తూ.
    అన్నా-చెల్లెళ్ళు, తండ్రీ- కూతుళ్ళు , అక్కా-తమ్ముళ్ళు తల్లీ-తండ్రీ, పిల్లలూ ఇలా ఎందరో గుడి చుట్టూ ప్రదిక్షిణాలు చేస్తున్నారు.
    వాళ్ళందరినీ చూస్తుంటే కడుపు నిండిపోయింది.మనసంప్రదాయాలు ఎక్కడికీ పోలేదు. వెళ్ళిపోయాయని భ్రమ పడుతున్నాం, అంతే.
    లేదంటే ఈ సందడి అంతా ఎందుకుంటుంది? తనే అనవసరంగా ఆందోళన పడుతోంది. మనసుకు తనకు తనే సమాధానం చెప్పుకుంది.
    గుడి చుట్టూ జాతర. రకరకాల షాపులు, గుంపులు గుంపులుగా జనాలు. అమ్మేవాళ్ళు, కొని పెట్టేవాళ్ళూ, కొనునుక్కునే వాళ్ళతో ఆ ప్రదేశం అంతా సందడి సందడిగా ఉంది.
    రమ్య తన తమ్ముడికి బెలూన్స్, బూరలు, ఆడుకునే గేంస్ కొనిపెట్టింది.
    "ఆంటీ! మీరేం తీసుకోరా?" "నాక్కావల్సిన ప్రశాంతత గుడిలోనే దొరికిపోయింది" అన్నా సంతృప్తిగా.
    "మీరు భలేవారు ఆంటీ" అంది రమ్య.
       "ఆంటీ లాంటి వాళ్ళు మన ప్రక్కన ఉండటం మన అదృష్టమే" అన్నారు ఒకేసారి ఆ దంపతులు.
    అందరూ ఇంటికి చేరారు.
 గుడినుంచీ రాగానే వంట కార్యక్రమంలోకి దిగింది.  ఏది ఉన్నా లేకున్నా సాపాటు తప్పదు కదా అనుకుంటూ.
     భోజనాల టైముకు  అందరూ లేచి టిఫిన్లకు వచ్చారు.
     ఆ తర్వాత అంతా స్నానాలకు వెళ్ళారు. స్నానమయ్యాక గీత వేసుకున్న డ్రస్సు చూసి " గీతా! ఇంకొంచెం మోకాళ్ళ పైకి ఉన్నది వేసుకోవే, ఇంకా బాగుంటుంది. మరీ మోకాళ్ళ కిందికి ఉంటే ఏంబాగుంటుంది?" అంది మొదటి అస్త్రాన్ని ఉపయోగిస్తూ.
   అరగంట క్రితమే రమ్య వాట్సప్ లో మెస్సేజ్ పెట్టింది.
     "ఏంటి అమ్మేనా ఇలా మాట్లాడేది?"
 "బాగోదులేమ్మా! నువ్వేం వెక్కిరించక్కర్లేదు" అంది గడుసుగా.
      "ఎంత తక్కువ బట్ట కడితే  అంత ఫ్యాషన్ కదా! అందుకే అన్నాను. వ్యంగ్యంగా కాదు, నిజంగానే చెబుతున్నాను.
      మీరెలాగూ నా దారిలోకి రావటం లేదు. నేనే మీ దారిలోకి వచ్చేస్తే పోలా?"
    "అమ్మా! నువ్వెంత మంచిదానివైపోయావో" అంటూ దగ్గరికి వచ్చి ముద్దిచ్చి వెళ్ళింది గీత.
    "ఏమండోయ్! మీ పి.ఎ. రేఖ మూడుసార్లు ఫోను చేసింది" అంది నవ్వుతూ.
    "ఈ  రోజు సూర్యుడు పడమరన ఉదయించ లేదుకదా!  అమ్మాయి పదం వింటే రుసరుసలాడే భార్యామణి ఇలా అర్థాంతరంగా మారిపోతే దాని  అర్థమేమి గురుడా?" అనుకుంటూ జుట్టు పీక్కున్నాడు మిస్టర్ పి.కె.
    ముందుంది ముసళ్ళ పండగ అనుకుంది మనసులో సౌభాగ్య.
    తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ పబ్ కి బయల్దేరుతుంటే తనూ వస్తానంది.
    "నీకెవరున్నారు అక్కడ?" అడిగారిద్దరూ ఒకేసారి విస్మయంగా.
    "అందరికీ ముందే తెలుస్తారా? అక్కడికి వెళ్ళాక పరిచయం అవుతారు. మీ ఇద్దరికీ నేనేం అడ్డు రాను".
     ఇంకేం మాట్లడలేకపోయారు వాళ్ళిద్దరూ. అక్కడికి వెళ్ళాక హాలు అంతా  ఒకసారి పరికించి చూసింది.
     ఎవరూ ఒంటరిగా లేరు. అందరూ ఊగుతూ..తేలుతూ ..  అదో ప్రపంచంలోలా ఉన్నారు.
     పి.కె., గీత వాళ్ళ స్నేహితులతో  అప్పుడే జాయిన్ అయిపోయారు.
     "హాయ్! మాం! అంటూ వచ్చి చేయి కలపమంటూ ముందుకు చాచాడు ప్రతాప్.
     హాండ్సంగా ఉన్న అతన్ని పరికిస్తూనే చేయి కలిపింది సౌభాగ్య.
యాధాలాపంగా అది చూసిన పి.కె. కి మతి పోయింది.
     అతనితో అడుగులు వేస్తున్న సౌభాగ్యని చూస్తుంటే మనసు రగిలి పోయింది.
     ఏదో చూడటానికి వచ్చింది అనుకున్నాడు.
    'ఏం నువ్వు చేస్తే తప్పు లేదు కానీ, ఆమె చేస్తే తప్పేంటి?' అంది అంతరంగం.
    "అదెలా కుదురుతుంది?" అన్నాడు దానితో అమాయకంగా."
    "ఏం నీ కూతురికో నీతి.. నీ భార్యకో నీతా?" రెట్టించిన అంతరంగానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అతనికి.
    ప్రతాప్ అలా తన భార్య నడుము చుట్టూ చేతులు వేస్తూ డాన్స్ చెయ్యటం అసలు నచ్చలేదు.
    మొదటిసారే బయట పడితే బాగోదేమో అనుకుని తమాయంచుకున్నాడు.
    కాసేపవగానే "పదండి! ఇంటికి వెళ్దాం" అని తీసుకు వచ్చేసాడు.
    గీత ఆశ్చర్యంగా చూసింది తండ్రి వైపు.
    తను వెళ్ళి 'వెళ్దామా డాడీ?' అనేంత వరకు వెళ్దాం అనని డాడీ ఇదేమిటి, ఈ రోజిలా? అనుకుందే కాని ఆ పైన ఆలోచించాలనిపించలేదు.
    తన స్నేహితునికి బాయ్ చెప్పి వచ్చేసింది.
    ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంది సౌభాగ్య.
    పదే పదే ప్రతాప్ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుని మరీ ఆనంద పడింది.
    "చాల్లే! ఆపుతావా?" అని పి.కె. విసుక్కునేవరకు చెబుతూనే ఉంది. అదే కదా ఆమెకు కావలసింది.
    "మళ్ళీ ఆదివారం తనే వచ్చి నన్ను తీసుకెళతానన్నాడు" అంది మధ్యలో.
    "నేనున్నాగా! వాడు రావటం ఎందుకు?" అంటూ పేపర్ తీసుకుని బెడ్రూం లోకి వెళ్ళిపోయాడు.
    "ఏరా! పిల్లల్లూ! వీడియో గేమా? ఆడుకోండి! ఆడుకోండి! నేను టీ.వీ. చూస్తుంటాను. మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే భోజనం చేద్దాం సరేనా?" అంది టీ.వి. ని ఆన్ చేస్తూ.
    అసలు టీ.వి. జోలికి పోని తల్లి అలా అనేటప్పటికి తెల్లబోయారు వాళ్ళిద్దరూ.
    గంట తర్వాత "రామ్మా! ఆకలి వేస్తోంది!" అని గోల చేసిన పది నిముషాలకు నెమ్మదిగా వంటింటి వైపుకు నడిచింది.
వాళ్ళకే కాదు ఇంట్లో అందరికీ సౌభాగ్య ఇప్పుడు దొరకటం లేదు.
   వంట కూడా సరిగా చెయ్యటంలేదు. రైస్ కుక్కర్లో రైస్ వండేసి కర్రీస్, సాంబార్ తెచ్చేసుకోమంటుంది.
   ఇక ప్రతాప్ ఎప్పుడు ఇంటికి వెళతాడో తెలీదు. ఎప్పుడు చూసినా ఇక్కడే. ఎడతెగని కబుర్లతో సౌభాగ్య, ప్రతాప్ బిజీ, బిజీ.
   గీత కూడా వాళ్ళతో చేరిపోయింది.
   తల్లి తనని ప్రతీ విషయంలో వ్యతిరేకంగా మాట్లడుతుంటే తనకి నచ్చేది కాదు.
    ఇప్పుడు తన వైపే మాట్లాడుతున్నా నచ్చటం లేదు. ఎందుకని?
    మనది భారతీయ సాంప్రదాయం. నర నరాల్లో ఆ సెంటిమెంట్స్ లీనమయ్యే ఉంటాయి.
    చంద్రుణ్ణి, సూర్యుణ్ణి మబ్బులు ఎంతసేపు మూసి ఉంచగలవు? అలాంటివే ఈ విదేశీ అలవాట్లు కూడా! అందుకే తొందరగానే మేలుకుంది గీత.
     ఇక పి.కె. కి వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలలేక, వదిలి తను బయట ప్రశాంతంగా ఉండలేక  బయట పనులన్నిటికి ఫుల్ స్టాప్  పెట్టి ఇంటి పట్టునే ఉంటున్నాడు.
     ఇల్లంతా ఇప్పుడు బంధాలు, అనుబంధాలతో నిండిపోయింది. అనురాగాలు, ఆప్యాయతలతో వెల్లివిరుస్తోంది.

                    *                    *                 *

     "ఏంటి ఆంటీ? విశేషాలు?" రమ్య అడిగిందికన్ను గీటుతూ.
     "నీ ప్లాన్ మహత్యం రా. సంవత్సరం  కాదు, ఒక నెలకే అందరూ దార్లోకి వచ్చేశారు. ముఖ్య పాత్ర ప్రతాప్ ది అనుకో, అతనికి థాంక్స్ చెప్పాలి."
      "హ!హ!హ్హా ! థాంక్స్ ఎందుకు? అల్లుడ్ని చేసేసుకోండి. శాశ్వతంగా మీ సమస్య తీరిపోతుంది."
  "మంచి ఆలోచనే! నాకు రానే లేదు. ఎంతైనా యువతరం భలే షార్ప్. ఒప్పేసుకోవాలి."
   "అంత లేదులేండి ఆంటీ" అంది రమ్య.
   "ఏమైనా మా ఇంట్లో నవ్వుల పువ్వులు విరియటానికి కారణం నువ్వేరా"
   "మా ఆంటీ కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? అంకుల్ తోక జాడిస్తే చెప్పండి. మరో ప్రతాప్ ని దింపేస్తా."
    నవ్వుకున్నారిద్దరూ చేయి చేయి కలుపుకుంటూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి