3, మే 2016, మంగళవారం

నా కధ 'భ్రమర జీవితం'

ప్రరవే వారు కధా చర్చకు కధ పంపమంటే గతం లో పంపాను . అది సెలెక్ట్ అయ్యి' ఆమె '
అనే ఈ బుక్ లో ప్రచురింప బడటం కూడా జరిగింది . నిజం చెప్పాలంటే 'అనేక ఆకాశాలు ' గా వెలువడిన ఆ ప్రింటెడ్ బుక్ లో కూడా నా కధ ఉండాలి . కానీ నేను ఒకరికి పంపాల్సిన మెయిల్ మరొకరికి పంపడంతో అందులో ఛాన్స్ మిస్ అయ్యాను .
ఆ కధను ఇప్పుడు మీ కోసం పెడుతున్నాను .
* * *

భ్రమర జీవితం
వాతావరణం గంభీరంగా ఉంది. ఆకాశంలో మేఘాలు ఏ నిమిషానైనా వర్షించటం ప్రారంభించవచ్చు. అవి కుడా మనలాంటివే. దుఃఖాన్ని దాచుకొని దాచుకొని ఒక్కసారి కన్నీరు కారుస్తాయి. దానినే వర్షమని మనం భ్రమిస్తాం అనుకుంది 'భ్రమర’’.
లేకపొతే ‘భ్రమా, భ్రమా’ అంటూ తనని జీవితమంతా భ్రమలో ముంచి పడేసిన ప్రభాత్ ప్రభావం నుంచి ఎప్పటికీ బయటపడలేనేమో అనుకుంది ఇన్నాళ్ళూ. తన పేరన ఉన్న ఆస్థులన్నీ ఎంతో లాఘవంగా లాక్కొని ఇప్పుడు తను తినే అన్నం మెతుకులు కూడా తనవే అంటూ తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తియ్యాలని ప్రయత్నిస్తున్న ఇతను మనిషా? రాక్షసుడా?
అతనితో తను చేసింది కాపురమేనా? పిల్లల కోసం సాగిస్తున్న ఇష్టం లేని ..దీనికి ఏం పేరు పెట్టాలి? అసలు తను చేస్తున్నది తప్పా? ఒప్పా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? చెయ్యాలని అనుకున్నది సమాజం హర్షించదేమో! అయినా తన అనుభవం నేర్పిన పాఠం అదే! దాన్నే అనుసరించాలని..
కానీ ధైర్యం చాలటం లేదు. ఈ అధైర్యాన్ని వెంటబెట్టుకొనే ఇన్నాళ్ళు ఎవరేం చెబితే అది వింటూ గడిపేసాను. కనీసం ఇప్పుడైనా చివరి దశలో అయినా ..తన ఇష్టానికనుగుణంగా బ్రతకాలని ఎంతో ఉంది. కానీ ఆ అవకాశమే రాదేమో!
వచ్చేంతవరకూ మృత్యువు తన దరి చేరకుండా ఉంటుందా? ఏమో..ఆలోచనల్లో పడింది భ్రమర భ్రమరంలా.
సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం. అమ్మ’ ప్రసూనాంబ’ తనని ఎవరూ లేని గదిలోకి తీసుకువెళ్ళి మాట తీసుకుంది. ఆ మాట తన మంచికోసమేనని నమ్మింది ఇన్నాళ్ళూ!
"భ్రమరా! ఇన్నాళ్ళూ పుట్టింట్లో, మా అందరి మధ్య ఎలా ఉన్నా ఈ లోకం పట్టించుకోదు. అదే అత్తింట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే నిన్నెలా ఆక్షేపించాలా అని వెయ్యి కళ్ళతో అందరూ గమనిస్తూ ఉంటారు. ఆ కళ్ళకు నువ్వు దొరక్కూడదు. అలాగే నీది అని దేనినీ వేరు చెయ్యకు, చివరకు డబ్బయినా. ఆ ఇంటికి వెళుతున్నది నువ్వయినా ఇకనుంచి ఆ ఇల్లూ, ఆ సంసారం అంతా నీదే.ఆ ఇంట్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నీదిగానే భావించాలి.
"అబ్బా! అమ్మ ఎంత వివరంగా చెబుతోంది" అనుకొంది. ఆనాడు పిచ్చి మొద్దులా.
నష్టమొచ్చినా అని అంది కానీ, లాభమొచ్చినా అని అనలేదు అమ్మ. అంటే లాభాలు వస్తే అవి తనకి రావన్న సత్యాన్ని ఆ రోజే గ్రహిస్తే ఈ రోజు ఇలా వగచాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏం చేస్తాం. చేతుల్తో నీళ్ళు పట్టుకుంటే వేళ్ళ క్రింద నుంచీ జారిపోవటం ఎంత సహజమో కాలం అంతలా జారిపోయింది.
ఆనాటి అమ్మ హితబోధను ఈనాటివరకూ తను మరువలేదు. దానికనుగుణంగానే నడచుకుంది. లక్ష్మణరేఖలా అమ్మ మాటల్ని అమ్మరేఖగా గిరి గీసుకుని జీవితాన్ని గడిపింది.
ఇప్పుడవన్నీ తలచుకుంటుంటే ఎంత పిచ్చిగా ప్రవర్తించానో అ ర్థమవుతోంది. మరుదుల్నీ, ఆడపడుచుల్నీ వారి అవసరాల్ని అన్నీ తనవిగానే చూసింది. వాళ్ళూ మన పిల్లల్లాంటి వాళ్ళేగా అనే ప్రభాత్ మాట వేదవాక్కులా కళ్ళకద్దుకుంది. ఇప్పుడేమయ్యింది. వాళ్ళూ, వాళ్ళ బిడ్డలూ రాజాల్లాగా బ్రతుకుతున్నారు. తన పిల్లలు మాత్రం.. కట్నం ఇచ్చి పెళ్ళి చేయలేని పరిస్థితులలో ఆడ పిల్ల , ఉద్యోగం లేక, వ్యాపారానికి డబ్బు లేని స్థితిలో మగ పిల్లలు. వీళ్ళని నా వాళ్ళూ అని ఇప్పుదు వాళ్ళెవరూ అనుకోవటం లేదు.
1+1=2 అని చిన్నప్పుడు ఎప్పుడో చదివిన లెక్క. 2=1+1 ఒకటే కదా! అప్పుడు తమంత బాధ్యతగా తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా తమ పిల్లలకు, వారి భవిష్యత్తుకు దారి చూపించాలిగా?
మీరెవరో? అన్నట్లు ప్రవర్తిస్తున్నారే
అసలెలా అలా ఉండగలుగుతున్నారు?
వదినా ఫీజు కట్టాలి’ అని అనగానే, తన నెక్లేస్ అమ్మేసి డబ్బు సర్దిందే!
సంసారాల్లో పడ్డక ఇవన్నీ వాళ్ళకి గుర్తు రావా?
చేసిన సహాయాన్ని అలా మర్చిపోతున్నరన్న మాట.
పోనీలే చిన్నవాళ్ళు.. ఇప్పటికీ ప్రభాత్ వాళ్ళనే వెనకే సుకొస్తాడు. తప్పులు చేసినా తనవాళ్ళే కాబట్టి తప్పనిపించదు. అదే తన అన్నయ్యో, తమ్ముడో అదే పని చేస్తే భూతద్దంలోంచి చూస్తారు. బుద్ధి..ఆ బుద్ధిని ఎవరూ మార్చలేరు. తనవాళ్ళంతా నా వాళ్ళు అనుకునప్పుడు నావాళ్ళంతా తనవాళ్ళు కారా? ఎందుకీ వైషమ్యాలు?
తను సరిగా గమనించలేదు కానీ, పెళ్ళైనప్పట్నుంచీ తనకో నీతి, నాకో నీతి. అర్ధమయ్యేది కాదో...అర్ధమయ్యీ పట్టించికొనేదాన్ని కాదో.. ఇప్పటికీ నాకర్ధం కావట్లేదు.
ఉదయాన ప్రక్కమీదనుంచి లేవటం కూడా తనిష్టమే! తను పడుకోమంటే పడుకోవాలి,లేవమంటే లేవాలి. కాస్త బద్ధకంగా ఉంది పడుకోనిద్దురూ అంటే లేవవొయ్ సెలవు రోజు కూడా పనులు చెసుకోకపొతే ఎలా? అని
సెలవు తనకేనా? రోజూ క్యారేజీలూ, వంట.. ఈ హడావిడిలోనే సరిపోతుంది. ఒక్క ఆదివారమన్నా ఆలస్యంగా లేద్దామంటే పడనివ్వరు. పట్టించుకోనట్లు పడుకుందామనుకున్నా, లేచేంతవరకు సణుగుడే.
ఇంతేనా! తనకిష్టమైన రంగు చీర కట్టుకోవటానికి ఉండేది కాదు. చూసేది నేనుగా, నాకు ఎరుపు, నీలం, పచ్చ అంటే ఇష్టం, ఆ రంగులే కట్టుకో. అందులో రిక్వెస్ట్ ఉండదు, ఓన్లీ ఆర్డర్. తనకు చిన్నప్పట్నుంచి లేత రంగులంటే ఇష్తంగా ఉండేది. ముదురు రంగులంటే దూరం.. చాలా దూరం. . అలాంటిది ఇప్పుడు తను కట్టేవన్నీ ఆ రంగు చీరలే! ఈ మార్పుని గమనించింది ఎవరు? ఇదేమన్నా త్యాగమా అంటారు పైపెచ్చు రెట్టిస్తే?.
నాలెక్కలో అది గొప్ప త్యాగమే! మనకిష్టమైనవి కట్టుకుంటే ఉండే అనుభూతి వేరు. ఎదుటివారి కోసం కట్టుకుంటే ఉండే అనుభూతి వేరు. అంతే కాదు, వాళ్ళకోసం ఇష్టపడి కట్టుకుంటే ఒక రకం. కష్టపడి కట్టుకుంటే ఇంకో రకం.
ఈ ఒక్క విషయం లోనేనా..ఎన్నో విషయాలలో తేడాలు...ఎన్నెన్నో తే డాలు... లెక్కపెట్టలేనన్ని. పెళ్ళి కాకముందు గంటలు గంటలు ప్రకృతి ఆరాధనలో తను గడిపేది, వెన్నెలతో ముచ్చట్లు, నెలవంకతో అచ్చట్లు.. ఒక్కటేమిటి, రెండేమిటి, ఆకాశం, మబ్బులు, నక్షత్రాలు.. చెట్లు..అన్నిటితో ఊసులే. మరి ఇప్పుడు వంటింట్లోంచి వాటివంక తొంగి చూసే అవకాశమే ఉండదు. వంటిల్లే తనకి లోకమై పోయింది.
చిన్నప్పట్నించి ఉన్న తమ పద్ధతులే ఎందుకు మార్చుకోవాలి, వాళ్ళు మారకూడదా? మారే మాట ప్రక్కన పెట్టి, చీపురులా ఒక మూలకు తోసేసిన సంఘటనలెన్నో.?
ఆఫీసులో అమ్మాయిలకు ఏదో వంకతో తరచూ లిఫ్ట్ ఇచ్చే ప్రభాత్ ఒక రోజు.. ఒక రోజు.. కూరగాయలు తేవటానికి వెళ్ళిన తను అప్పటికప్పుడు బంద్ ప్రకటిస్తే ఎలా వస్తుంది అన్న ఆలోచన లేదు.
ఆపద్బంధవుడిలా దొరికిన ప్రక్కింటబ్బాయి స్కు టరు మీద వచ్చానని ఇప్పటికీ దెప్పిపొడుస్తూనే. ఆ రోజు తీసుకున్న క్లాసులు చాలవన్నట్లు.
ఎక్కేటప్పుడు వాళ్ళెలాంటివాళ్ళో చూడాలట. మరి అతను..అతనితో బండి ఎక్కిన వాళ్ళకి అలాంటి పట్టింపులు ఉండవా? తనవరకు వచ్చేటప్పటికి అడ్డమైన రూల్సే అడ్డం వస్తాయి. అంతెందుకు ఇంట్లో ఉండే టి . వి లో తనకిష్టమైన చానెల్స్ తను చూడ్డానికి లేదు.. అవి చూడకు చెడిపోతావు..ఇవి చూడు అంటాడు.. తను చెప్పినవే తనకు నచ్చకపోయినా చూడాలి. అందుకే మొత్తానికి చూడటమే మానేసింది.
రాత్రి పదకొండు గంటలకు తలుపులేసుకొని ప్రభాత్ చూసేవి, తనకు నచ్చనివే! అవి మానమని తను చెప్పినా వినడు కదా! ఇలా వింటూ ఎన్నా ళ్ళు బ్రతకాలి? ఎన్నో ప్రశన లు..జవాబుల వెదుకులాటలో తను ఎన్నాళ్ళు గడిపిందో?.
ఇప్పుడంతా బాగానే ఆలోచిస్తున్నావు..అప్పుడా తెలివి ఎక్కడికి పోయింది..అంతరంగం దెప్పి పొడవ వటంతో కాస్త చిన్న బుచ్చుకున్నా పోనీలే ఎందరినో క్షమించాం, దీనినీ క్షమించేద్దాం అనుకొని మళ్ళీ ఆలోచనల్లో పడింది. అప్పుడే అలా అలోచించగలిగితే ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితుల్లో తనెందుకుంటుంది?
తనెంత తెలివి తక్కువదంటే తను అన్నం తినటానికి అమ్మ ఇచ్చిన వెండి కంచం కూడా ఆడపడుచు మొగుడు అలకకి పణంగా అప్పగించేసింది. అవన్నీ ఉంచుకుంటే ఎంత డబ్బు ఉండేది తన దగ్గర?
హ (! కంచం గురించి ఆలో చిస్తోంది జీవితాన్నే పణంగా పెట్టావన్నది తెలియని నువ్వు నిజంగా వెర్రి దానివే.. అంతరంగం నిర్మొహమాటంగా మాట్లాదుతోంది. మరి ఇన్నాళ్ళూ దాని నోరు నొక్కేసింది తనే కదా!
కనీసం రాత్రి కూడా స్వేచ్చ ఉండేది కాదు. తనకిష్టమున్నా , లేకున్నా అతని చేతుల్లో ఇమడాల్సిందే! అదే తను ముచ్చట పడ్డా చెప్పలేని మొహమాటం, చెప్పినా వినకపొతే అదో సిగ్గు వ్యవహారం. అవైనా వేళ్ళమీద లెక్కపెట్టేన్నే!
అసలెందుకు సహకరించాలి? నాకిష్టం లేదని ఎందుకు చెప్పకూడదు? ఎవరో ఎవరినో ప్రశ్నించినట్లు తనను తనే ప్రశ్నిం చుకుంది.
పువ్వు చుట్టూ భ్రమరం తిరుగుతుంది. కానీ భ్రమరం చుట్టూ పువ్వు తిరుగుతుందా ?ఇంత చిన్న విషయం గ్రహించకే జీవితం అంతా హారతికర్పూరంలా కరిగించుకుంది.
తనని చూస్తే తనకే జాలి వేస్తోంది. జాలి కూడా జాలిపడే స్టితిలో ఉన్న తను చూస్తుంటే తనకే నవ్వు వస్తోంది.
ప్రభాత్ కి వార్ధక్యం మీదపడింది అనటానికి గుర్తుగా తల అంతా తెల్లగా మెరిసిపోతోంది. ప్రతి శనివారం దానికి మేకప్ వెయ్యాలి. అది కూడా తన చేత్తోనే చెయ్యాలి. అంత షోకు చేసుకొని ఆఫీసులో ఎవరివెంటో పడుతున్నాడట. ఈ మధ్య ముసలి వాళ్ళే బాగా సుఖపెడుతున్నారని ఆడవాళ్ళు నిశ్చయించుకున్నారేమో !
దానికి తోడు టీ. వీలో ఏ ఛానల్ తిప్పినా ఇవే సీరియల్స్ .. సీ .. రియల్స్ .. లా..
ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువుల్లా ఆ భయంకరమైన చూపులు ఏమిటి?ఆ ఎత్తుకు పైఎత్తులేమిటి? ఎదుటివాళ్ళను చంపాలంటే ఎన్ని వెధవప్లానులున్నాయో ఈ సీరియల్స్ చూస్తే అర్ధమైపోతుంది. అంతా ఆడ విల్లన్సే!నిజజీవితంలో అసలు అంతమంది ఉన్నారో లేరో కానీ ఈ సీరియల్స్ చూసి మాత్రం ఎలాంటి ఆడవాళ్ళు తయా రుఅవుతున్నారన్నదిఖఛ్చితమైన అభిప్రాయం.
ప్రక్కింట్లో పిల్లలు క్యారంబోర్డ్ నిలబెట్టటం గురించి మాట్లాడుకుంటున్నారు.
‘’ఆలాక్రిందపెడితే పాడైపోతుంది. చూడు!ఎత్తుగా బిళ్లలున్నాయి. ఆ(!ఆ(! ఆవైపు క్రింద పెట్టాలి. .అప్పుడు బోర్డు పాడవదు “
తనకెందుకో ఆమాటల్లో వేరేఅర్ధాలు గోచరిస్తున్నాయి. ఎలా నిలబడితే తన కాళ్ళమీద తను నిలబడగలదో ఆ సంఘటన చెబుతున్నట్లే ఉంది.ఇప్పుడు తన గురించితను ఆలోచించుకోవటమే కాకుండాఎదుటవారి గురించి కూడా అభిప్రాయం చెప్పగలిగే స్థాయికి ఎదిగింది.అవును. తను పెరిగింది ఎంత ఎత్తుకో తెలియదు కానీ ఎంతో కొంత పెరిగింది.కాకపోతే అంత ఎత్తు నుంచి క్రింద పడకుండా చూసుకోవాలి. అంటే ఆర్ధికంగా నిలబడగలగాలి. ఆ మార్గం ముందుగ కనిపెట్టాలి.వంటింట్లో చీకట్లో మగ్గిపోయిన తను ఇప్పటికిప్పుడు వెలుగు కావాలంటే సాధ్యమేనా?
“సాధ్యమే!”ఎవరో చెప్పినట్లు వినిపించింది సమాధానం.
“ఎలా?”అమాయకంగా తన ప్రశ్న.
అటు ప్రక్కవాటా లోంచి మాటలు వినిపిస్తున్నాయి. గోడ ఒక్కటే అడ్డమవటంతో అన్ని మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
“అమ్మ వంటనేర్చుకోరా అంటే మగవాడినని అది నేర్చుకుంటే ఆడదానివని ఎగతాళి చేస్తారని నేర్చుకోలేదురా. ఇప్పుడు చూడు మెస్సులలో,హోటళ్ళలో తిండి తినలేక చస్తున్నా!అమ్మలా చేసిపెట్టేవాళ్ళు దొరికితే
ఎంత బాగుంటుంది?”
“ఆవునురా!”
“నిజంరా!”
“దొరుకుతారంటావా?”
నలుగురిది ఒకే మాట.
అప్పుడు వెలిగింది తన మెదడులో ఫ్లాష్.
నిజమే.తనొక “హోమ్ ఫుడ్స్”ఎందుకు ప్రారంబించకూడదు ఆ నలుగురితో?అమోఘమైన ఆలోచన.
వారి దగ్గరే అడ్వాన్సు తీసుకుంటే సరిపోతుంది.
అంతే. ఆ నలుగురు వంద సంఖ్యకి పెరిగారు. అలా .. అలా.. నగరంలోకెల్లా పేరున్న హోమ్ ఫుడ్స్ గా” భ్రమర హోమ్ ఫుడ్స్” పేరు గడించింది.
ఇప్పుడు ఒంటరి జీవితమే అయినా హాయిగా ఉంది. తన ఊపిరి తను స్వేచ్ఛగా పీల్చగలుగుతోంది.తన నిర్ణయాలు తను తీసుకోగలుగుతోంది. ఆ స్వాతంత్ర్యం తనకిచ్చి ఉంటే ప్రభాత్ ను విడవాల్సిన అవసరం వచ్చేది కాదు.పిల్లలు తమ కిష్ట మొచ్చిన చోట ఉంటున్నారు.
ప్రగతి తనను బాగా అర్ధం చేసుకుంది. తనతోనే ఉండిపోయింది. ఈ సంవత్సరం సంపాదన చూసుకున్నాక దాని పెళ్లి చేయగలనన్న ధీమా ఏర్పడింది. ఇ లా ఇంకో మూడేళ్ళు కష్టపడితే దాన్ని ఇంకో ఇంటిదాన్నిచేయవచ్చు.
“అంటే నీలా కష్టాల ఊబిలోకి నెడతావన్నమాట. పెళ్లి చెయ్యకుండా ఉండకూడదా?అసలు పెళ్లి లేకుండా బ్రతకలేదా?”మనసు ప్రశ్న.
తన బ్రతుకులో దాంపత్యనౌక బీటలు వారిందని దాన్నే త్యజించాలనుకోవటం తప్పు. ఆ నావలో ప్రయాణించేప్పుడు ఎవరు ఒక ప్రక్కకు ఒరిగినా నా వ ఒరిగిపోతుంది. ఆధిక్యత అన్నది మనసుల్లోకి రాకుండా సమానత్వం పాటిస్తే దాంపత్యం మధురంగా ఉంటుంది. భార్యా భర్తలు మొగుడుపెళ్ళాలులా కాకుండా చక్కటి స్నేహితుల్లా ఉండగలిగితే దాని కంటే మించిన వరం ఉండదు.
అందుకే మంచి సహచరుణ్ణి వెతుక్కునే అవకాశాన్ని ప్రగతికి ఇచ్చి పర్యవేక్షణ పగ్గాన్ని మాత్రం తన చేతుల్లో ఉంచుకుంది.
* * * *
నాలుగు సంవత్సరాలు నాలుగుక్షణాలులా గడిచిపోయాయి.`విశ్వం’ ను తన లైఫ్ పార్ట్ నర్ గా తన ముందు నిలబెట్టింది. చదువులో,సంపాదనలో,వ్యక్తిత్వంలో ఇద్దరూ ఒకరికి ఒకరు సరిజోడి.
తన నుంచీ ఏ అభ్యంతరం లేదు. సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేయించి ఇంటికి తీసుకువచ్చింది. కాపురానికి కావాల్సిన సామానులు కొని ఇచ్చింది. చివరగా ప్రగతితో ఒకే మాట చెప్పింది. నీనా తన అనుకోవద్దు. నాది+తనది=మనది అనుకోమని.
నీది, నాదీ లేదు అంతా మనది అనుకొని నాకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. ఆ కారణంగా మీ నాన్నతో మాటలు పడలేక విడి పోయాను. నీకలా జరగటానికి వీల్లేదు. మనసులో పదే పదే అదే ఆలోచన. తన జీవితపాఠo ప్రగతికి మొదటి పాఠo అవటం భ్రమరకి ఎంతో ఆనందానిచ్చింది.
* * * *
కాలాన్ని బట్టి “ఈక్వేషన్స్”మార్చుకోవాలి. పాతవే పట్టుకొని వ్రేలాడితే ఎలా?
* * * *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి