1, మే 2016, ఆదివారం

చూపుల యాక్సిడెంట్లా?

చూపుల యాక్సిడెంట్లా?
గడియారం  టంగున గంటకొట్టింది. నా చూపు  అనుకోకుండా అటు వెళ్ళింది. అమ్మో! తొమ్మిది గంటలు. ఇంకొక్క పదిహేను నిమిషాలలో బయలుదేరాలి. 'నిర్ణీత' నా కూతురు. చదివేది ఎల్.కే.జీ . చెబుతుంది నాకే పాఠాలు . ఇంకా దానికి టిఫిన్ కూడా పెట్టలేదు. దానికి టిఫిన్ ఎక్కడ పెట్టాలో అదే నిర్ణయించుకుంటుంది. కాదంటే ఆరున్నొక్క రాగం. బ్రతిమాలే టైం ఉండదు. ఎలాగైతేనేం ఒక ఇడ్లీ, ఒక గ్లాసుడు పాలు దాని పొట్టలోకి ఎక్కించి పాపని తీసుకుని బయట పడ్డాను . రెండు సందుల అవతలే దాని స్కూల్. బిజీ సెంటర్. వచ్చే పోయే వాహనాలతో రోడ్డు దాటటానికి ఐదు నిమిషాలు పడుతుంది యాక్సిడెంట్లా?. దానిని బట్టి టైం ప్రకారం కాకఐదు నిమిషాలు ముందే బయల్దేరటం 'పవిత్ర' కి అలవాటు.
    ఒక చేతిలో బుట్ట, ఇంకో చేతితో పాపను పట్టుకుని నడుస్తున్న ఆమెలో ఎన్నో ఆలోచనలు. ఏమిటి ఈ ట్రాఫిక్? మై గాడ్ ! ఒక్క నిమిషం లో ఎన్ని వాహనాలు పరిగెడుతున్నాయి? సుజికీలు ,లూనాలు, రిక్షాలు, సైకిళ్ళు, వాటి పైన మనుషులు, వారి చూపులు. ఇలా రోడ్డు మీద తారస పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు మరొకరిని చూడటం సహజం. అది లిప్తపాటు. కాని ఆడవాళ్ళు
బయటకు వస్తే మగవాళ్ళ చూపుల  యాక్సిడెంట్లను ఎన్ని భరించాలో!
    రోజూ ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఇదే! మనుషులు అందరూ ఒకేరకంగా వుండరు. ఒకొక్కరు ఒక్కోరకంగా ప్రవర్తిస్తూ వుంటారు. వాళ్ళలో చెడ్డవాళ్ళు అనబడే వాళ్ళే లెక్కలేనంత మంది. కాస్త అందంగా  ఆడపిల్ల కనపడితే చాలు, నేల కనపడదు జనాలకు. అలా చూస్తూ డ్రైవ్ చేస్తే ఎదుటివారికి   ఎంత ప్రమాదం? అయినా బ్రతుకు మీద తీపి కూడా ఉండదా?
     అదుగో.. స్కూల్ ముందు కాపలాగా రెడీగా  వున్నాడు ప్రబుద్ధుడు. ఎర్రగా, అందంగా, హిరో లాగ ఉంటాడు. కాని బుద్ధులు మాత్రం నీచం.తన ముగ్గురు పిల్లలను దించడానికి వస్తాడు. అతను అక్కడ వుంటే వొంటి మీద తేళ్ళు, జెర్రులూ ప్రాకినంత అసహ్యం గా వుంటుంది. ఎందుకంటే అతని చూపు పడని  ప్రదేశం మన శరీరం లో ఉండదు.
     అసలు బయటవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. అలా అబగా చూడటమే! 'నిర్ణీత'ను స్కూల్ లో దింపి, ఆయా కు అప్పచెప్పి బయటకు వచ్చాను.
      విలన్ గారి చూపులను దాటుకుని నేనైతే వెళ్లాను కాని, నా వెనకబాగం అతని వేడి చూపులకు గురి అవుతోందే! కనుచూపు మేర వరకు అతను అలా సారిస్తూనే ఉంటాడు.

     అందాన్ని శాపం గా ఇచ్చి మమ్మల్ని ఇలా వేధించడం ఎందుకు? ఇష్టమైన చీర కట్టుకోడానికి లేదు.అందంగా రెడీ అవటానికి లేదు.ప్రతీదీ ఆలోచించి ఈ మగబుద్ధులకు భయపడాలా? స్త్రీలకు స్వతంత్రంగా రోడ్డుమీద నడిచే అవకాసం కూడా లేదా?
                 నిన్న సాయంత్రం ఎదిరింటి వాళ్ళ అమ్మాయి 'సుమిత్ర' తో అనుకోకుండా ఇవే మాటలు వచ్చాయి. రొజూ తనకు ఎదురయ్యే అనుభవాలను  చెబితే "అక్కా! పెళ్లై, ఓ పాప వున్నా నీకే ఇలా వుంటే ఇక మా సంగతి ఆలోచించు. బయటకు వెళితే చాలు చూపుల ఎక్స్ రేలు. వాటిని తట్టుకోవటం చాల కష్టం. అదేదో తమ హక్కు అన్నట్లు వుంటుంది వాళ్ళ ప్రవర్తన .బైకు మీద మన చుట్టూ తిరుగుతారు. లేదంటే ముందుకు వెళ్లి వెనక్కు వస్తారు. వెంబడిస్తారు . ఏదో రకంగా మాట్లాడాలని చూస్తారు. అవన్నీ తప్పించుకుంటుంటే  ఇప్పుడు మరో కొత్త  బెడద వచ్చి పడుతోంది. ఎవడో ఒకడు వచ్చి ఐ లవ్ యు చెప్పటం. కాదంటున్నా  కొన్నాళ్ళు వెంటపడి వేధించడం, ఉన్నట్లుండి యాసిడ్ బాటిల్ తో దాడి. బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. ప్రేమించామన్న వాళ్ళందరిని పెళ్లి చేసేసు కుంటామా  ? మనకూ కొన్ని అబిప్రాయాలు ఉంటాయి గా.. వాటి గురించి ఆలోచించరేం? మూర్ఖంగా.   ప్రవర్తించే ఇలాంటి వాళ్ళకు వాళ్ళ మొఖం మీద కూడా ఆసిడ్ పోసి బుద్ది  చెప్పాలి అనిపిస్తుంది.ఇంతలో వాళ్ళ అమ్మ పిలవటం తో "వస్తాను అక్కా" అని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా, ఆలోచనలు తనను వదలలేదు. ఈ బాధ తనొక్కర్తిదీ కాదు. ఆడవాళ్ళూ అంతా అనుభవించే నరకం.మగవారి స్వభావాలలో మార్పు రావాలి. అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఆలోచిస్తూ నాకు తెలియకుండానే రోడ్డు మీదకు వచ్చేసాను.          
     ఎదురుగుండా సైకిల్ మీద అతను.. వాడు నేను దాటిపోయే వరకురోడ్డు వంక చూడడు. మామూలే. ఇతనికి ఏమైనా అయితే అతని బార్య పిల్లలు ఏమైపోతారు? నాలుగడుగులు ముందుకు వేసానో లేదో కెవ్వున అరుపు. వెనక్కి తిరిగి చూస్తే ఇంకేం వుంది, ప్రక్క సందులోంచి వచ్చిన కారు అతన్ని గుద్దేసింది. అతను క్రింద పడటం, అతని కాళ్ళ మీద నుంచి కారు చక్రం వెళ్ళిపోవటం అంతా క్షణాలలో జరిగిపోయింది. అప్పటిదాక అందరినీ తిట్టుకున్న నా మనసు "అయ్యయ్యో!" అనుకుంటూ వాపోయింది. గబగబా దగ్గరకు వెళ్లాను. అతని కాళ్ళు రక్తం తో తడిసిపోయి టపటప కొట్టుకుంటున్నాయి. బాధతో అతని కళ్ళు విలవిలలాడుతున్నాయి. చుట్టూ చేరిన జనం " ఇది యాక్సిడెంట్ కేస్, మనకు ఎందుకు తద్దినం" అని ఎవరికీ వారు చూసి వెళ్ళిపోతున్నారు.
     యాక్సిడెంట్ అయితే ఎవరూ  పట్టించుకోరు. కారణం, తీసుకుని వెళ్లి సహాయం చేసినవారిని జైల్లో తొయ్యటమే! నేను అవన్నీ పట్టించుకో దలచుకోలేదు.అతను బ్రతికితే కేస్ రాదని డ్రైవర్ కి ధైర్యం చెప్పి, అక్కడవాళ్ళ సహాయంతో కారు లోకి ఎక్కించి, గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళి చేర్పించాను. అతని కళ్ళలో పశ్చాతాపం. అతి బలవంతం మీద రెండు చేతులు ఎత్తి నాకు నమస్కారం చేసాడు.
    వస్తానన్నట్లు అతని వైపు చూసాను.అతని కళ్ళలోంచి రెండు కన్నీటిబొట్లు రాలాయి.
    ఇదే మార్పు నేను కోరుకున్నది . కానీ ఈ మార్పు యాక్సిడెంట్ జరగక ముందు వస్తే బాగుండేది  కదా అనుకుంటూ తృప్తి గా వెనుతిరిగాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి